Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకళ్లావీ! కురులావీ!

కళ్లావీ! కురులావీ!

At Last Got it:
“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే
త్వం జీవ శరదశ్శరం

వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ?
ఏందే నీ మాయ!
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ?
పోయిందే సోయ!
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటినాకీ తడబాటసలేందే
ఉందే దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అధోగతి

అన్యాయంగా మనసుని గెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా

రంగ ఘోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళావీ కళావతి కల్లోలమైందే నా గతి
కురులావి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ…”

జీవితంలో ఒక్కో అనుభవం ఒక్కో పాఠం నేర్పుతూ ఉంటుంది. బతుకు ఒక పాఠం. ప్రత్యేకించి చిన్నప్పుడు సరిగ్గా చదువుకోని నాలాంటివారికి పెద్దయ్యాక మళ్లీ బడికి వెళ్లినా చదువు చట్టుబండలే తప్ప పాలిష్ బండలు కావు. మా నాన్న అష్టావధాని, తెలుగు పండితుడు కావడంతో…కనీసం సవర్ణదీర్ఘ సంధి అయినా సరిగ్గా నేర్చుకో…భవిష్యత్తులో దేనికయినా ఉపయోగపడుతుంది అని చెప్పేవారు. పండితపుత్రుడిని…తొక్కలో సవర్ణదీర్ఘ సంధి నాకో లెక్కా? అని నేను ఆయన మాటలను పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు ఆ తొక్కలో అనుకున్న సవర్ణదీర్ఘ సంధి కూడా అర్థం కాక…చింతించాల్సి వస్తోంది.

ఇప్పటికి 16 కోట్లమందికి అర్థమై, ఆనందిస్తున్న “కమ్మాన్ కమ్మాన్ కళ్ళావతి” పాట నాకు అర్థం కాకపోవడానికి చిన్నప్పుడు తెలుగు వ్యాకరణం సరిగ్గా చదువుకోకపోవడమే కారణం. దీనికి పూర్తిగా నా చదువులేమిదే బాధ్యత తప్ప…ఆ పాట రాసిన అనంత్ శ్రీరామ్ కానీ, పాడిన సిధ్ శ్రీరామ్ కానీ, బాణీ కట్టిన తమన్ కానీ, నటించిన మహేష్ బాబు కానీ ఏ రకంగానూ బాధ్యులు కారు.

తెలుగువాడినే అయినా నాకు తెలుగు రాదు. దాంతో ఇంగ్లీషు తెలిసిన మా అబ్బాయి ఈ తెలుగు పాటకు అర్థం చెప్పాడు.
కళ్ళావీ!
కురులావీ!
అన్న మాటలతో హీరోయిన్ ను హీరో ముద్దుగా పిలుస్తున్నాడని రెండు నెలలుగా అనుకుంటున్నాను. తమిళ, మలయాళ భాషల్లో అందాల రాక్షసి లాంటి చిలిపి మాటలేమో అని మనసు పరిపరి విధాల కీడు శంకించింది. నాకు పరిచయమున్న భాషా శాస్త్రవేత్తలందరినీ అడిగాను. వ్యాకరణ పండితుల కాళ్లు పట్టుకుని అర్థం చెప్పాలని ప్రాధేయపడ్డాను. అందరూ చెయ్ ఖాళీ లేదు…ముందుకు పొమ్మన్నారు.

ఇంటా, బయటా, కార్లో, అనంత విశ్వంలో సిధ్ శ్రీరామ్ నా వెంట పడి…కళ్ళావీ! కురులావీ! అని పిలుస్తూనే ఉన్నాడు. చివరకు ఇంజనీరింగ్ చదివే మా అబ్బాయి చెప్పాడు…అవి పేర్లు కావట.
కళ్లా ప్లస్ అవి? – కళ్ళావి? ప్రశ్న అట.
కురులా ప్లస్ అవి?- కురులావి? మరో ప్రశ్న అట.

 Kalaavathi Song

ఇంజనీరింగ్ చదివితే తప్ప ఆధునిక గీతాలు అర్థం కావని క్లారిటీ వచ్చి మనసు కుదుట పడింది. రెండు నెలలుగా చిత్రగీత చిత్ర వధ. మనసు మనసులో లేదు. రెండు పదాలకు అర్థం కనుక్కోలేని నా తెలుగు భాషాభిమానం నన్ను చూసి వికటాట్టహాసం చేస్తోంది. ఎప్పుడో చిన్నయసూరి రాసిన వ్యాకరణమే నేటికీ వాడాలని పట్టుబట్టడం సమంజసం కాదు.

ఎలాగూ తెలుగు పాటలు తెలుగువారికి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాకుండా ఇంగ్లీషు లిపిలో వెలగబెట్టి జాగ్రత్తపడుతున్నారు కాబట్టి..
Kurulavi!
Kallavi!
అన్న లిప్యంతరీకరణకు తోడుగా…
Is this hair?
Is this eyes?
అని పూర్తి ఇంగ్లీషులోనే పాట రాసి పెడితే…తెలుగువారికి ఇంకా సులభంగా అర్థమవుతుందేమో దగ్గరుండి సిధ్ శ్రీరామ్ చేత పాడించానని బహిరంగంగా మీడియాకు చెప్పుకున్న రచయిత అనంత్ శ్రీరామ్ పెద్ద మనసుతో ఆలోచించాలి.

సిధ్ శ్రీరామ్ దయచేతను, అనంత్ శ్రీరామ్ ఔదార్యం వల్లను సర్కారువారి పాట ప్రామాణిక భాష ప్రకారం తెలుగు పాటల్లో మీరు విని తీరాల్సిన తెలుగు మాటలివి:-

ఉల్టే…ఉల్టే…
నా మది నిల్డా…
చేతులావీ!
కాళ్ళావీ!
వేళ్లావీ!
చర్మమాదీ!/చర్మాదీ!
ప్రేమాదీ!
కోపమాదీ!
తాపమాదీ!”

ఒక వందో…ఒక వెయ్యో…ఒక లక్షో…తెలుగు సంధులు మీదికి దూకినాయా?
పోయిందా సోయా?

 Kalaavathi Song

ఇట్టాటివన్నీ మీకలవాటే లేదా?
అట్టాటి మీకు అలవాటయ్యిందా?
దడగుందా?

వినకుంటే…
అధోగతి!

చించి
అతికించి
ఇరికించి
విదిలించి
వదిలించి
జాడించినట్లుందా?

రంగా
ఘోరంగా
అన్యాయంగా
మనసును కెలికి
అన్నం మానేసి వింటున్నారా?

కుళ్ళబొడిచింది చాలదు తీ!
తీ! ఇంకా తీ!

“అ – ఇ – ఉ – ఋ -ల కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును”

అర్జంటుగా ఈ సవర్ణదీర్ఘసంధి సూత్రాన్ని తిరగరాసి…కొత్త సూత్రానికి ఉదాహరణలుగా కళ్లావి; కురులావి చెప్పకపోతే నాలాంటి నిరక్షరకుక్షులకు అనంతమయిన తెలుగు గీతాజ్ఞానం మిస్సయ్యే పెను ప్రమాదముంది!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

త్రిబుల్ ఆర్ పుస్తకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్