Behind the Scene: మహారాష్ట్ర ప్రభుత్వ మహా పతనం గురించి మీడియాలో లెఫ్ట్, రైట్ కోణాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది.
లెఫ్ట్ కోణం:-
1. సంఖ్యా బలం లేకపోయినా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఇప్పటి బి జె పి కి ఎవరూ సాటి రారు.
2. మహారాష్ట్రలో శివ సేన చీలిక వర్గం ఏకనాథ్ షిండే బృందాన్ని ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ, బి జె పి పాలిత రాష్ట్రంలో అయిదు నక్షత్రాల పూటకూళ్ళ విడుదుల్లో క్యాంప్ రాజకీయాలకు ఖర్చు పెడుతున్నది ఎవరు?
3. మొన్నటికి మొన్న రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు లెక్క ప్రకారం ఓట్లు తక్కువ పడినా…క్రాస్ ఓటింగులతో మహారాష్ట్రలో అదనపు అభ్యర్థులను బి జె పి ఎలా గెలిపించుకోగలిగింది?
4. గౌహతి క్యాంపులో ఎకనాథ్ షిండే విడుదల చేసిన వీడియోలో…తమ వెనుక బి జె పి ఉందని మొదట పరోక్షంగా చెప్పి…వెంటనే ఎందుకు మాట మార్చి ఆ అదృశ్య శక్తి బాల్ థాకరే అని అన్నారు?
5. మధ్యప్రదేశ్ లో సంఖ్యా బలం చాలకపోయినా బి జె పి ఎలా అధికారంలో కూర్చుంది?
6. జనం ఓట్లకు, జనం ఆకాంక్షలకు- ప్రభుత్వం ఏర్పడడానికి సంబంధం లేదా?
7. ఎమ్మెల్యే క్యాంపు రాజకీయాలను సమర్థంగా నిర్వహించగలిగితే…ఏ రాష్ట్రంలో అయినా…జనం గెలిపించకపోయినా… అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చా?
రైట్ కోణం:-
1. శివసేన పుట్టిందే అతివాద హిందుత్వ పునాదుల మీద. అలాంటి శివసేనకు సహజంగా బి జె పి బంధువు కావాలి కానీ…కాంగ్రెస్, ఎన్ సి పి ఎలా దగ్గరవుతాయి? మైనారిటీల కోసం గొంతు కోసుకునే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఇక శివసేనకు హిందుత్వ పునాది ఏమి మిగిలి ఉంటుంది?
2. కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీరీ పండిట్ల మీద దాడుల విషయంలో శివసేన కార్యకర్తలు నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ తో కలవకపోతే ఈ విషయాలు శివసేనకు గొప్ప ఆయుధాలు అయ్యేవి.
3. శివసేన నినదించే మరాఠాల ఆత్మ గౌరవ నినాదం ఎన్ సి పి శరద్ పవార్ కాళ్ల దగ్గర పడి ఉండాల్సి వచ్చింది.
4. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరు. కొడుకు ఆదిత్య ప్రభావంతో పార్టీలో సీనియర్ లీడర్లకు విలువ లేకుండా పోయింది.
5. హిందూ భావోద్వేగ అంశం చిన్నది దొరికితే మొత్తం మహారాష్ట్రను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన బాల్ ఠాక్రే రోజులు పోయి…హిందువులకు అన్యాయం జరుగుతుంటే…శివసేన చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది.
6. శివసేన సింహాలు గ్రామ సింహాలుగా గోళ్లు గిల్లుకోవాల్సి వచ్చిందన్న కార్యకర్తల బాధ.
7. ప్రభుత్వంలో తన పక్కనే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఉద్ధవ్ గమనించకపోవడం. ఇంటలిజెన్స్ వైఫల్యం. పార్టీని పూర్తిగా గాలికి వదిలేయడం.
ఇందులో ఎవరి కోణం వారిది. అసలు సంగతి అందరికీ తెలుసు.
ఇప్పుడున్న మోడీ- షా బిజెపి పాత బిజెపి కాదు. మహారాష్ట్రలో శివసేన కలిస్తే తమతో కలుస్తుంది…లేకపోతే లేదు అనుకున్న బి జె పి కి ఉద్దవ్ కాంగ్రెస్, ఎన్ సి పి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఊహించని షాక్ తగిలింది. అప్పటి నుండి ఉద్ధవ్ కు తగిన గుణపాఠం చెప్పాలని బి జె పి ఎదురు చూస్తోంది. మూడో కంటికి తెలియకుండా చదరంగంలో పావులను చాకచక్యంగా కదపగల మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉండనే ఉన్నాడు. అంతే- ఏకనాథ్ షిండే ఎపిసోడ్ తెరమీదికి వచ్చింది.
తెర మీద కనిపించేది ఏకనాథ్. దీనికి రచన, దర్శకత్వం, నిర్మాణం, నిర్వహణ వేరెవరో…ఎక్కడో ఉంటారు. “ఎవరు కొడితే…దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో…?” అన్న సినిమా డైలాగ్ మరాఠీలో ఉందో? లేదో? తెలియదు. ఉద్ధవ్ కు అనుభవమైతే గానీ…తత్త్వం బోధపడినట్లు లేదు.
“ఎప్పుడొచ్చామన్నది కాదన్నా…బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే లెక్క.”
“ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచారన్నది కాదన్నా.
ప్రభుత్వం ఏర్పాటు చేశామా? లేదా? అన్నదే లెక్క!”
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :