Sunday, January 19, 2025

వెంటాడే అలలు

Vizag Waves…:
“గగనం గగనాకారం
సాగరః సాగరోపమః।
రామరావణయోర్యుద్ధం
రామరావణయోరివ॥”

సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అన్నాడు వాల్మీకి మహర్షి రామ- రావణ యుద్ధ వర్ణనలో. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. అలా రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక తప్ప మరొకదానితో పోల్చలేము అన్నాడు.

సముద్రం దగ్గరికెళ్లిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చే శ్లోకాల్లో ఇదొకటి. పాలు తాగే పసిపిల్లలకయినా అర్థమయ్యేంత సులభంగా ఉంటుంది వాల్మీకి వర్ణన.

“సగర” చక్రవర్తులు తవ్వితే ఏర్పడింది కాబట్టి “సాగరం” అనే పేరొచ్చినట్లు వాల్మీకి రామాయణం చెప్పింది. సీతమ్మను వెతకడానికి మహేంద్ర పర్వతం మీది నుండి ఎగిరిన వెంటనే హనుమను ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా మైనాక పర్వతం కోరడానికి సాగరుడే కారణం.

నన్ను పుట్టించింది సగరులు. వారి వంశం వాడయిన రాముడి పని మీద వెళ్లే హనుమకు ఆతిథ్యం ఇవ్వడం నా ధర్మం. నాకు పైకెగిరే శక్తి లేదు. నువ్వు ఎగరగలవు కాబట్టి పైకి వెళ్లి హనుమను సాదరంగా ఆహ్వానించు” అని సాగరం మైనాకుడిని కోరింది. అలా పెరిగిన మైనాకుడిని చూసి తొలి విఘ్నం అని అనుకుంటాడు హనుమ. విషయం తెలిసి…
“చాలా త్వరగా వెళ్లాల్సిన పని. ఒక్క క్షణం కూడా ఆగడానికి లేదు. నువ్వు నాకు ఆతిథ్యమిచ్చినట్లే…నేను తీసుకున్నట్లే…”
అని హనుమ వెళుతున్న వేగంతోనే వక్షస్థలాన్ని మైనాక పర్వతం అంచుకు తగిలించి అలాగే వెళ్లిపోతాడు.
“ఉపకారానికి పరత్యుపకారం చేయడం కనీస ధర్మం”

“అసలు పని చెడిపోయే పనులు మధ్యలో ఎప్పుడూ పెట్టుకోకూడదు”
లాంటి ఆణిముత్యాలను వాల్మీకి ఇక్కడ అక్షర లక్షలుగా మనకిచ్చాడు.

మన జీవితమే ఒక పెద్ద సముద్రం. ఎంత ఈదినా అవతలి ఒడ్డు కనిపించనే కనిపించదు.
సముద్రంలో చుట్టూ నీళ్లే. కానీ గొంతు తడుపుకోవడానికి చుక్క కూడా పనికిరాదు.

కదిలి కదిలి నదులన్నీ కడలిలోకే చేరాలి.
సముద్రమంత సహనం ఉండాలన్నారు.
చంద్రుడిని చూస్తే మనమే కాదు…సముద్రం కూడా పొంగుతుంది.
అలలు ఎంత ఎగసిపడినా ఆకాశం చేరవు. కానీ…సముద్రం ఎగసి పడితే మాత్రం సునామీ వస్తుంది.

ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులను మన దాశరథి పట్టుకున్నాడు. సముద్రాన్ని మించిన మానవ కల్లోల సముద్రాలను అక్షరాల్లో ఆవిష్కరించాడు.

“చతుస్సాగర పర్యంతం…”
అని అనాదిగా చెప్పుకుంటూనే ఉన్నాం.
భూమి సముద్రాన్ని పట్టుకుందా?
సముద్రమే భూమిని పట్టుకుందా?
రెండిటినీ ఇంకేదో శక్తి పట్టుకుని నిలిపిందా?

సీతమ్మ జాడ వెతకడానికి నాలుగు దిక్కులకు పంపే నాలుగు బృందాలకు సుగ్రీవుడు చెప్పిన వివరాలు వింటే మన జి పి ఎస్, కరెంట్ లొకేషన్ మ్యాపులు, భూ మధ్య రేఖలు ఎంత చిన్నవో అర్థమవుతాయి. భూగోళం మీదున్న సకల పర్వతాలు, నదులు, ఎడారులు, సముద్రాలను పూసగుచ్చినట్లు చెబుతాడు. ఎక్కడ ఏయే ప్రమాదాలు పొంచి ఉంటాయో హెచ్చరికలు చెబుతాడు.

విశ్వనాథ సత్యనారాయణ “చెలియలి కట్ట” నవల ఉండనే ఉంది. ఎన్ని యుగాలయినా…ఎన్నెన్ని నదులు నిత్యం సముద్రంలో కలుస్తున్నా…

Vizag Beach
సముద్రాల్లో రోజూ మనం లక్షల క్వింటాళ్ల చెత్త, వేయకూడని ప్లాస్టిక్ వేస్తున్నా…కలపకూడని విష రసాయనాలు కలుపుతున్నా…
సముద్రం “చెలియలి కట్ట”(తీరం) దాటలేదు కాబట్టి…
ఏదో…మనమిలా బతికేస్తున్నాం.
లేకపోతే…మనమెప్పుడో సముద్రం పాలు అయి ఉండేవాళ్లం.

(విశాఖలో నాలుగు రోజులు సముద్రాన్ని చూసే సరికి…వెంటాడిన సముద్రపు అలలు ఇవి)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

RELATED ARTICLES

Most Popular

న్యూస్