Understand the Situation: రాష్ట్రంలో ఆదాయాలను, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పీఆర్సీ రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్నారు. ఉద్యోగుల జీతాల బడ్జెట్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉందని, దక్షిణ భారత దేశంలో ఎపీలోనే ఎక్కువ హెచ్ఆర్ఏ ఉందని తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, కరోనా లేకపోయి ఉంటే 98 వేల కోట్లు ఆదాయం ఉండేదని, కానీ ప్రస్తుతం 62 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోందని వివరించారు. పదేళ్ళలో రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, కరోనా వ్యాప్తితో ఆర్ధిక పరిస్థితుల్లో కూడా ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్ మూడో దశ, ఓమిక్రాన్ ప్రభావం కూడా ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని, కాబట్టి ఉద్యోగులందరూ ఆలోచించాలని సిఎస్ విజ్ఞప్తి చేశారు. మొన్న విడుదల చేసిన జీవోలను వెనక్కుతీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తో కలిసి మీడియా సమావేశంలో సమీర్ శర్మ పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా 17 వేల కోట్ల రూపాయల మధ్యంతర భ్రుతి ఇచ్చామని, ఐఆర్ ను జీతంలో భాగమని చెప్పలేమని సిఎస్ వ్యాఖ్యానించారు. తాజా పీఆర్సీతో ఉద్యోగుల ప్రస్తుత గ్రాస్ శాలరీ లో ఎలాంటి తగ్గుదల ఉండబోదని స్పష్టం చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ళకు పెంచారని, సిఎం జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని, పీఆర్సీలోని అన్ని అంశాలూ సిఎం కు తెలుసని వెల్లడించారు.
ఐఎస్ఎస్ లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయని వ్యాఖ్యానించడం సబబు కాదని సిఎస్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని తాము కూడా పాటించాలని నిర్ణయించామన్నారు.
Also Read : ఉద్యోగుల పోరాటానికి మద్దతు: యనమల