కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నదీ జలాల కేటాయింపులకు సంబంధించినది కాదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన రావు స్పష్టం చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి మాత్రమే నేడు నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. 2015 జూన్ 19న కేంద్ర జల సంఘం సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేటాయింపులపై ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. దీని ప్రకారం 66 శాతం ఆంధ్ర ప్రదేశ్ కు, 34 శాతం తెలంగాణకు చెందే విధంగా కెసియార్ ఒప్పుకున్నారని రఘునందన్ రావు అన్నారు. నాడు 34 శాతానికి అంగీకరించిన కెసియార్ నేడు 50 శాతం వాటా అడుగుతున్నారని, దీన్ని తప్పుబట్టడంలేదని, కానీ ఈ రెండేళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
నేటి నోటిఫికేషన్ ను రాజకీయ కోణంలో చూడవద్దని, కొత్త ట్రిబ్యునల్ ముందు మన తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడదామని సూచించారు. గత రెండు నెలల నుంచి ఇరు రాష్ట్రాల నేతలు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేస్తూ వచ్చారని, ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. కేవలం ఉపఎన్నికలు వచ్చినప్పుడో, రాజకీయంగా బలహీనపడ్డప్పుడో ఇలాంటి వివాదాలు తెరపైకి తెస్తున్నారని, ఈ ప్రస్తుత వివాదం ఏపి ప్రభుత్వంతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగమని రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రం ఏదో అన్యాయం చేస్తున్నట్లుగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. కేవలం హుజూరాబాద్ లో లబ్ధికోసమే ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని చెప్పారు.