అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజని అధికార పార్టీ ఎమెల్యేలు తమ పార్టీ సభ్యులపై దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాదన్నారు. ఇది శాసన సభకాదని, కౌరవ సభ అని మరోసారి వ్యాఖ్యానించారు. ఏపీ చరిత్రలో ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఘటన ఏనాడు లేదని, ఎమ్మెల్సీ ఫలితాలు చూసి జగన్‌కు పిచ్చెక్కింది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ సమక్షంలో నే తమపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా స్పీకర్ పై తాము దాడి చేశామంటూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిబి వీరాంజనేయులుపై వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని… గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వెల్లంపల్లి శ్రీనివాస్ తోసేశారని వెల్లడించారు. తాము చెప్పింది తప్పు అనుకుంటే సభలో జరిగిన మొత్తం వీడియో ను బైట పెట్టాలని డిమాండ్ చేశారు. తమపై దాడి చేసి తప్పుడు సమాచారం బైటకు చెప్పడం హేయమన్నారు.
జీవో నంబర్ 1 కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తే తప్పేమిటని, వారికి నచ్చకపోతే సస్పెండ్ చేయాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏమిటని అచ్చెన్న వాపోయారు
Also Read : AP Assembly: తీవ్ర ఉద్రిక్తత – సభ వాయిదా