అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అనుమానితుడిని సంఘటనా స్థలంలోనే హతమార్చినట్లు ఫార్మింగ్‌టన్ పోలీసు విభాగం తెలిపింది. కాల్పుల్లో గాయాలకు గురైన ఇద్దరు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఘటన తర్వాత స్కూల్‌ను మూసివేశారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. కాల్పులకు కారణం తెలియరాలేదని, విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని వివరించారు. ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. అగ్రరాజ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే భరోసా లేకుండాపోతున్నది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు కాల్పులు జరుగుతున్నాయో తెలియని దుస్థితి. ఎవరు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తారో చెప్పలేని పరిస్థితి.
ఈ కాల్పులకు గురవుతున్న వారిలో భారతీయులు సైతం ఉండడం ఆందోళన వ్యక్తమవుతున్నది. పుట్టిన దేశాన్ని వదిలి.. ఉన్నత చదువులు, ఉద్యోగాల మోజులో అమెరికా బాటపట్టి బిడ్డలు విగతజీవులుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ప్రభుత్వేతర సంస్థ గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ సంవత్సరం 215 కంటే ఎక్కువగానే కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.