Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడ్డం మాత్రం ఇష్టముండదు. మల్టిప్లెక్స్ లు వచ్చాక…థియేటర్ కు వెళుతుంటే…మనమేదో నేరం చేసి విచారణ ఎదుర్కొంటున్న దోషుల్లా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది నాకు. బయట 20 రూపాయల వాటర్ బాటిల్ మల్టిప్లెక్స్ లో 80 రూపాయలు ఎందుకవుతుందో? బయట 10 రూపాయల పాప్ కార్న్ మల్టిప్లెక్స్ లో 120 ఎందుకవుతుందో కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఆ లోకోత్తర సినిమాలకు తొలివారం రెండు, మూడింతలు రేట్లు పెరగడం మీద కూడా నాకు పట్టింపు లేదు. నా వ్యాపార వ్యవహారాలవల్ల క్లయింట్లు చేసినప్పుడు తప్పనిసరిగా మాట్లాడాల్సిన ఫోన్ కాల్స్ నన్ను థియేటర్ కు కొంత దూరం చేశాయి. సగటు మనుషులుగా మన ఆత్మాభిమానాలను మల్టిప్లెక్స్ లు దెబ్బ తీస్తాయి. స్కానర్లు, శల్య పరీక్షలు, గజిబిజి పార్కింగ్ నిరీక్షణలు, ఆకాశం అంచున ఉన్న థియేటర్ కు వెళ్లేప్పుడు పనిచేసే లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు…వచ్చేప్పుడు మాయమై…మెట్లు మాత్రమే ప్రత్యక్షం కావడం…ఇలా వినోదం కాస్త అవమానంగా పరిణమించి థియేటర్లను నేనే బహిష్కరించాను.

నాలుగయిదేళ్ళ కిందట థియేటర్ కు వెళ్లి బాహుబలి చూశాను. దాని తరువాత కోరి కోరి థియేటర్ కు వెళ్లి మొన్న కాంతార చూశాను. ఇంకో అయిదేళ్లవరకు థియేటర్ కు వెళ్లకుండా గడిపేయవచ్చు అనుకున్నాను. ఒ క కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మా బంధువు ఒకరు టికెట్లు బుక్ చేస్తే…బుక్ అయి నేను- నా భార్య ఒకానొక మల్టిప్లెక్స్ లో ఒకానొక సినిమాకు రిక్లయినర్ వాలు కుర్చీలో కూర్చున్నాం. మమ్మల్ను బుక్ చేసిన మా బంధువు సీటును పరుపుగా చేసుకుని హాయిగా నిద్రపోయారు. ఆమె భూసార, పంటల శాస్త్రవేత్త.  ఇలాంటి నిస్సార నీరవ నిర్వీర్య సినిమాలను నిశీధిలో ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు శాస్త్రీయంగా తెలుసు. మాకు నిద్ర రానందువల్ల మాచే సినిమా చూడబడింది. లేదా సినిమాకు మేము గురి అయ్యాము. లేదా సినిమా మా మీద పడింది.

Violence

చిన్నప్పటినుండి మా అమ్మానాన్నలు నన్ను చాలా పిరికిగా పెంచారు. దాంతో సినిమా మొదలవ్వగానే మా ఆవిడ నా చేయి పట్టుకుని…ధైర్యం చెప్పింది. ఇంటర్వల్ లో ఒకరినొకరు ఓదార్చుకున్నాం. నువ్ ముందు రానన్నావ్…నేనే ఇలా ఫిక్స్ చేశాను…అని తను పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. సుఖాల్లో కంటే కష్టాల్లోనే ఆలుమగలు ఒకరికొకరు తోడుగా ఉండాలన్న “మాలిమి తాలిమిన్ కొలుచు మానము లేదు…ఎడద బాకుల పోటులు బ్రువ్వనీ…వసంతాల వనాల పూల పవనాల విలాస విహారమేయగున్” విద్వాన్ విశ్వం పెన్నేటి పాటను గుర్తుకు తెచ్చుకుని…నా ఆనందానికి తనను తాను ఎంతగా శిక్షించుకుందో కదా! అని అనుకున్నాను.

ఈలోపు సెకండాఫ్ బిగిన్ అయ్యింది. ఊచకోత. హింస. తలలు తెగుతున్నాయి. గుండెల్లో గునపాలు. థియేటర్ తెర అంతా రక్తం. తల లేని మొండేలు. తెగిన కాళ్లు, చేతులు. విరిగిన ఎముకలు. ఒక సినిమాలో అతకని వేరు వేరు కథలు. ఒక కథలో రెండు, మూడు సినిమాలు. హీరో సినిమా కథలో విలన్ కోసం డైలాగ్ చెబుతున్నారో? లేక బయట తన ప్రత్యర్థులనుకునే వారిని సంబోధిస్తూ హెచ్చరికలు చేస్తున్నారో? అంతా అయోమయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సకల భద్రతా వ్యవస్థలు అన్నీ జీరో అయ్యాయి. హీరో దేవుడయ్యాడు. క్లైమాక్స్ కు ముందే కొందరు లేచి వెళ్లిపోయారు. క్లైమాక్స్ అయిపోయినా కొందరు లేవలేకపోయారు.

నిస్సత్తువ, నైరాశ్యం నిండి వైరాగ్యంతో మేము థియేటర్ బయటపడ్డాం. ఇంటికొచ్చే సరికి నా మిత్రుడు, ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి వాట్సాప్ మెసేజ్ ఉంది. “మన చేతుల్లో లేని సమస్యలు మానసికంగా మనల్ను ఎలా కుంగదీస్తాయో వివరిస్తూ నేను చెప్పిన ఈ వీడియో చూడు…” అని. భగవంతుడు దయామయుడు. ఒక కష్టానికి పక్కనే ఒక సుఖాన్ని పెడతాడు. లేదా ఒక సుఖం వెంబడే ఒక కష్టాన్ని పెడతాడు.

ఉదయం లేచేసరికి తలతిరిగినట్లు, కడుపు తిప్పినట్లు, కళ్లల్లో రక్తం కారుతున్నట్లు, ఆఫీసుకు వెళ్లలేని నీరసంగా ఉన్నట్లు అనిపించి ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చేశాను. అన్నీ విన్న డాక్టర్…నిన్న ఫలానా సినిమా చూసి ఉంటారు…దానికి అలోపతి పనిచేయదు. “మణి మంత్ర ఔషధం” అన్న ఆధ్యాత్మిక వైద్యమే దిక్కు. మూడు రోజులు పొద్దున్నే స్నానం కాగానే పరగడుపున విష్ణుసహస్రనామ దివ్యౌషధం వేసుకోండి. “కొనరో కొనరో కూరిమి మందు- ఉనికి మనికికెల్ల ఒకటే మందు…తొల్లి ప్రహ్లాదుడు చవిగొనిన మందు…చల్లని మందు…భవరోగములు బాపెడి మందు…” అని అన్నమయ్య చెప్పింది కూడా ఈ విష్ణు ఔషధమే అన్నారు. ఈ సినిమాకయితే మూడు ఉదయాలు చాలు. ఆ సినిమా కూడా చూస్తే…సాయంత్రం కూడా ఇదే దివ్యౌషధం తీసుకోండి అని అడగకుండానే చెప్పారు. అదేమిటి మీరు ఫార్మా మందులు కదా ఇవ్వాలి? అనడిగాను. నాకు గంజీ తెలుసు- బెంజీ తెలుసు అని ఆయన కూడా పంచ్ డైలాగ్ ప్రిస్క్రిప్షనే మెదలుపెట్టారు. రోగిని బట్టి, రోగాన్ని బట్టి వైద్య ప్రక్రియ మారుతుంది అన్నారు. ఆ చర్చ మనకెందుకు సినీమాయరోగం తగ్గితే చాలు అనుకుని… “వైద్యో నారాయణో హరిః” అని అనుకున్నా.

Violence

తెర మీద సినిమా హీరో వల్ల ప్రతి పరిష్కారం ఒక సమస్యగా ఎంతగా పరిణమిస్తున్నా…
బయట ప్రకృతిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉంటుంది అని వేదాంతులు చెప్పే మాట ఎప్పుడు నిజమవుతుందో!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

సీమకు కళ్లున్నాయి, చెవులున్నాయి

Also Read :

అతడు అడవిని జయించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com