Sunday, January 19, 2025
Homeసినిమా‘టాప్ గేర్’ అద్భుతంగా ఉంటుంది : ఆది సాయి కుమార్

‘టాప్ గేర్’ అద్భుతంగా ఉంటుంది : ఆది సాయి కుమార్

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

“టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్‌.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం. టాప్ గేర్‌ అనే టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్ ‌గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. డైరెక్టర్ శశికాంత్ చూస్తే.. ఓ ప్రొఫెసర్‌లా ఉంటారు. కానీ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్ కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. చాలా క్లారిటీతో ఉండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని అన్నాడు”

“టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయినా జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది అంచనా వేయలేకపోతున్నాం. ఇప్పుడు మాస్ స్టోరీలంటే అర్థం మారింది. కేజీయఫ్ సినిమా వచ్చి అంతా మార్చేసింది. అలాంటి సినిమాలే ఇప్పుడు మాస్‌కు నచ్చుతున్నాయి. ఇప్పుడు చేస్తే అలాంటి సినిమానే చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను”

టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. టాప్ గేర్ అద్భుతంగా ఉంటుంది. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తాను” అంటూ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్