Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅత్త మీద కోపం దుత్త మీద

అత్త మీద కోపం దుత్త మీద

Protest on RRB decision: అసలే దేశ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. చదువు “కొన్న” వాడికి, చదువుకున్న వాడికి కూడా సరిఅయిన ఉద్యోగాలు లేవు. ఒక పక్క మన రాజకీయ నాయకులు తమ మేధోజనిత కార్యక్రమాల పరంపరతో ప్రజలను అభివృద్ధి పధంలో పరుగులెత్తిస్తూ ఆకాశ హర్మ్యాలలోకి ఎక్కిస్తూనే, మరో పక్క బీద, పేదతనంతో కుళ్లి, కునారిల్లి అభివృద్ధి పధాన్ని అందుకోలేక చతికిలబడే బడుగులను ఎత్తుకొని, సంక్షేమం నిచ్చెనలు ఎక్కించి మరీ ఊహా లోకాలలో విహరింప చేస్తున్నా, జనం కడుపులూ నిండడం లేదు, కాళ్ళు దారిద్ర్య రేఖను దాటడం లేదు.

దానికి తోడు “కోవిడ్” మహమ్మారి వచ్చి పడింది. ఇవాళ, రేపు ఎవడు ఏ కంపనీ మూయాలన్న, ఉద్యోగులను తీసేయాలన్నా, జీతాలు, అలవెన్స్ లు తగ్గించాలన్నా, అప్పు కట్టడం వాయిదా వేయాలన్నా, చివరకు ఇంటి అద్దె కట్టడం వాయిదా వేయాలన్నా, చివరకు కాపురాలు కూలడానికైనా, కారణం ఏమైనా బూచిగా కోవిడ్ నే చూపుతున్నారు. ఉద్యోగం లేని వాడికి ఎలాగో లేదు, ఉన్నవాడిని ఈ కోవిడ్ రోడ్డున పడేసింది. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు అన్నీ ఈసురోమని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.

Students Protest Against Ntpc Exam

దేశంలో నిరుద్యోగం పురులు విప్పుకొని నాట్యం చేస్తోంది. ఉద్యోగం దొరకబుచ్చుకోవడం కంటే గగన కుసుమాలు సాధించడమే తేలికగా ఉన్నది. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన బెడితే, ఉన్న ఉద్యోగాలు నిలుపుకోవడమే ప్రాణాంతకంగా ఉన్నది. సంఘటితం లేదు, అసంఘటితం లేదు, ప్రైవేట్ లేదు పబ్లిక్ లేదు, ఏదైనా సరే. అయితే “కోవిడ్ దెబ్బకో” లేదా ప్రభుత్వ “ఇన్నోవేటివ్” పాలసీల దెబ్బకో మూతపడడం, దాంట్లో ఉద్యోగులు రోడ్డున పడడం నిత్యకృత్యం అయ్యింది.

ప్రైవేట్ లో ఉద్యోగాలు ఏ ప్రాతిపదికిన వస్తాయో, ఎప్పుడు ఊడతాయో అందరి నుదుట రాతలు రాసే బ్రహ్మకే తెలియదు. కాబట్టి మనం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఉండడమే మేలు. ఇక ప్రభుత్వం వారు అప్పుడప్పుడు దయతలచి ఏదో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే అది పండుగే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత ఆ నోటిఫికేషన్ చూడగానే ఉద్యోగం వచ్చినట్లు సంబరపడే సగటు నిరుద్యోగులు ఎందరో. ఇక ఆ ఉద్యోగానికి అప్లై చేసి, నానా కష్టాలు పడి, నానా పుస్తకాలు సంపాదించి, కోచింగ్ లు తీసుకొని, పగలనక-రాత్రనక కళ్ళు కాయలు కాచేలా చదివి, పరీక్షలు రాసి, ఫలితాల కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత, పరీక్ష రద్దనో లేదంటే మళ్ళీ పెడతామనో అంటే, కోపం నషాలానికి అంటుకొంటుంది. ఏమి చేయాలో తెలియని నిస్సహాయత కోపాన్ని రగిల్చి విచక్షణను నశింపచేస్తుంది. విధ్వంసానికి పురిగొల్పుతుంది.

నిన్న రైల్వే లో ఉద్యోగార్ధులు చేసింది ఇదే. చాలా రోజుల తరువాత ఎప్పుడో 2019 లో సుమారు గా 35000 ఖాళీల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి పోలో మంటూ ఒక కోటి 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంటే దాదాపు ప్రతి పోస్ట్ కు దాదాపు 357 మంది సగటున పోటీ పడి రైల్వే శాఖ పెట్టిన పరీక్ష రాశారు. గత నెల 15 న ఫలితాలు వచ్చాయి. ఈ లోపే ఏమైందో రైల్వే శాఖ వారు ఇంకో పరీక్ష పెడతామని ప్రకటించారు. మొదట ఒకటే పరీక్ష అని మళ్ళీ ఈ ట్విస్ట్ ఏమిటని ఉద్యోగార్ధులు మండిపడ్డారు. రైల్వే అధికారుల మీద కోపం రైళ్ల మీద వ్యక్తం అయ్యింది. వీరి ఆగ్రహానికి బలి అయింది రైళ్లే కావడం విషాదం.

అంతా బాగుంటే ఆ రైల్వేలో ఉద్యోగం సాధించి, ఆ రైళ్ల అభివృద్ధికి పాటుపడి, ఆ రైళ్లను సరిగ్గా నడిపించవలసిన బాధ్యత గల ఉద్యోగార్ధులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఆ రైళ్ల పైనే వెళ్లగక్కి ఒకటి, రెండు రైళ్లను ఆగ్నికి ఆహుతి చేశారు. ఎన్నో రైళ్ల రద్దుకు కారణం అయ్యారు. బాధ సహేతుకమే, కానీ వ్యక్తీకరణ పద్ధతి ఇదేనా? తప్పెవరిది? ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చి, దానికి కోటి 25 లక్షల మంది పోటీ పడుతున్నపుడు రైల్వే శాఖ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? పరీక్ష పద్దతిలో మార్పు చేయదలచుకొంటే ఎంత సున్నితంగా వివరించాలి. బాధ్యత లేకుండా ఉద్యోగార్ధులను ఆందోళనకు గురిచేసి, అపోహలకు తావిచ్చేలా ప్రకటనలు చేస్తే, పర్యవసానాలు ఇలాగే ఉంటాయేమో!

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read : హంతక పురాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్