Saturday, November 23, 2024
HomeTrending Newsనెలాఖరులోపు 50వేల రుణమాఫీ

నెలాఖరులోపు 50వేల రుణమాఫీ

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటి వరకు 25 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ రూ. 50 వేల వరకూ ఉన్నరుణాలను మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినేట్ ఈ మేరకు నిర్ణయించింది.

అందుకు ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రుణ మాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను కేబినేట్ ఆదేశించింది. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.  25 వేల రుణమాఫీతో ఇప్పటికే 3 లక్షల పైచిలుకు రైతులు ప్రయోజనం పొందారు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 9 లక్షలకు చేరనున్నది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగుతుందని కేబినెట్ భరోసా ఇచ్చింది.

ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ పై కేబినెట్ సమీక్షించింది. గత కొద్దికాలంగా కురుస్తున్న వర్షాలు, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువులు కుంటలల్లో నీరు చేరుతున్న పరిస్థితి, వరినాట్లు పడుతున్న సందర్భంలో, పలు రకాల పంటల సాగు ప్రారంభమైన తరుణంలో వాటికి సాగునీటి లభ్యత, రైతులకు ఎరువులు అందుబాటు, తదితర వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అంశాలపై కేబినెట్ చర్చించింది.

ఈ సందర్భంగా పత్తిసాగుపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల పత్తి సాగును రాష్ట్రవ్యాప్తంగా మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్