Sunday, January 19, 2025
HomeTrending Newsకరోనా కంటే కేసియార్ డేంజర్ : రేవంత్ రెడ్డి

కరోనా కంటే కేసియార్ డేంజర్ : రేవంత్ రెడ్డి

సిఎం కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారో తెలియదని, అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనను అభినందించడానికి వస్తున్న కార్యకర్తలతో బిజీ బిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డి… ఇవాళ కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, గెడ్డం వినోద్ లను కలుసుకున్నారు. అనంతరం డిసిసి అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసియార్ ఏ రాత్రి పూటో హఠాత్తుగా ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

తన కంటే ఎక్కువ అనుభవం వున్న వాళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారని, వారికి ఉత్సహం ఇచ్చేందుకే సోనియా తనను పీసీసీ చీఫ్ గా నియమించారని వెల్లడించారు. నాకు ఈ పదవి రావడంలో డిసిసి అధ్యక్షుల తోడ్పాటు కూడా ఎంతో ఉందన్నారు. అందరి అభిప్రాయాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్దామని నేతలకు సూచించారు. తమది కాంగ్రెస్ కుటుంబమేనని, ప్రత్యేకమైన సందర్భాల్లో ఇతర పార్టీల్లో పనిచేశానని వెల్లడించారు. తాను సోనియా మనిషినన్నారు.

ఎప్పుడో బ్రహ్మోత్సవాలకు బయటికొచ్చే సిఎం కేసియార్ ఈ మధ్యకాలంలోనే బయటికొస్తున్నారని…. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో అర్ధం చేసుకోవాలని రేవంత్ కోరారు. మొన్న దళిత్ మీటింగ్ అని డ్రామాలు చేశారని, ఏడేళ్ళుగా దళితులపై దాడులు, అక్రమ అరెస్టులు చేసినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఆర్థిక ఇబ్బందులతో దళితులు మరణిస్తే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను కూడా కెసిఆర్ మోసం చేశారని, ఎన్నికలప్పుడు మాత్రమే గొర్రెల పంపిణీ గుర్తొస్తుందని, 50 శాతం ఉన్న బిసిలకు 3 శాతం నిధులు కేటాయించారని విమర్శించారు.

ఉన్నత చదువులు యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ మొట్టమొదటి ప్రణాళిక నిరుద్యోగ సమస్యలపైనే ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. తెలంగాణ తల్లి.. కేసీఆర్ బిడ్డ పోలికలున్న బొమ్మ కాదు. మనకు తెలంగాణ తల్లి సోనియా గాంధీయేనని చెప్పారు.

కేసీఆర్, కేటీఆర్ ఆర్ధిక ఉగ్రవాదులంటూ రేవంత్ ధ్వజమెత్తారు. అమరవీరుల స్థూపాన్ని కూడా వదల్లేదమని, దానిలో కూడా కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని వెల్లడించారు. జూలై 7 ఆధారాలతో బయట పెడతానని ప్రకటించారు. రెండేండ్లు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, రావణాసురుని ఎదుర్కోడానికి వానర సైన్యం ఎలా పనిచేసిందో.. కేసీఆర్ ను గద్దె దించాలంటే.. కాంగ్రెస్ శ్రేణులు అలా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్