Saturday, January 18, 2025
HomeTrending Newsకలుపుమొక్కలతో కలుపుగోలు తనమా?

కలుపుమొక్కలతో కలుపుగోలు తనమా?

TS PCC Chief Revanth Reddy To Follow Late Dr YSR  : 

అందరినీ కలుపుకుని పోతా..
కాంగ్రెస్ పార్టీలో ఈ మాట వింటుంటే.. భలే  కామెడీగా వుంటుంది.
ఎవరు పీసిసి అధ్యక్షుడైనా.. ఈ తంతు మామూలే.
అందరినీ కలుపుకుని పోతాననే అంటారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదేమాట అంటున్నారు.
నిజంగా ఆ పార్టీలో అది సాద్యమా..
ఇంకొకరో.. మరొకరో అయితే, వేరే విషయం.
రేవంత్ ఈ మాట చెప్పడమేంటి…

ఎబివిపిలో మొదలయ్యాడు.
టీఆర్ ఎస్ లో ట్రైచేసాడు.
టీడీపీలో సక్సెస్ అయ్యాడు.
చివరికి తప్పని సరి  పరిస్థితిలో కాంగ్రెస్ లో ఎంటరయ్యాడు.
జైపాల్ రెడ్డి తమ్ముడికి రేవంత్ అల్లుడు..
ఆ రకంగా  కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ అల్లుడుగారు..
ఎప్పుడెళ్ళినా మర్యాదలకేం లోటుండదని రేవంత్ కి తెలుసు.
అందుకే అన్ని పార్టీలు అయిపోయాకే కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టాడు.
అడుగుపెట్టిన దగ్గర నుంచి రేవంత్ చూపు అందలం మీదే వుంది.
కాంగ్రెస్ లాంటి పార్టీలో ఊదుకాలదు.. పీరు లేవదు అని రేవంత్ కి తెలుసు.
తానొకడుగు ముందుకేస్తే, పదిమంది వెనక్కి లాగుతారనీ తెలుసు.
కానీ, రేవంత్ ఫార్ములా వేరు..
ఆయనకి టీడీపీ నేర్పించిన పాఠమొకటుంది…

ఒక రోజు కోమటిరెడ్డి నేనే పిసిసి చీఫ్ అవుతా అంటాడు.
ఇంకోరోజు జగ్గారెడ్డి పోటీకొస్తాడు.
ప్రతిరోజూ వి హెచ్ తిడతాడు.
పొన్నం ప్రభాకర్ నేనేం తక్కువ అంటాడు.
అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానని శ్రీధర్ బాబు అంటాడు.
తెలంగాణ కాంగ్రెస్ లో బడా బడా నేతలకు లోటేం లేదు.
ఒక్క నల్గొండ జిల్లాలోనే ఒక మంత్రివర్గానికి సరిపడా సీనియర్లున్నారు.
మిగతా జిల్లాల్లో నెంబర్ కాస్త తక్కువైనా, నస మాత్రం ఎక్కువే.
మరి ఇంత కంగాళీ కాంగ్రెస్లో రేవంత్  చేరి నిండా నాలుగేళ్ళు గడవలేదు.
అప్పుడే పిసిసి చీఫ్ కావడం అంటే మామూలు విషయం ఏం కాదు.
ఇందుకు రేవంత్  వాడిన ఫార్ములా సింపుల్..
పార్టీలో ఎందరున్నా.. ఎవరు ఏం మాట్లాడినా.. డోన్ట్ కేర్..
డైరెక్ట్ గా బాస్ తో టచ్ లో వుండాలి.
బాస్ కి కావల్సినవే చేయాలి.
తెలంగాణ టీడీపీలో రేవంత్ ని లీడింగ్ లో నిలబెట్టింది ఈ ఫార్ములానే.
ఇప్పుడు కాంగ్రెస్ లో వాడుతున్నదీ ఈ ఫార్ములానే.
పార్టీలో ఎవరేమన్నా..అననివ్వలి.
తాను మాత్రం ఏమున్నా..  ఢిల్లీలోనే చూసుకుంటాడు..
ఏదున్నా రాహూల్ తోనే మాట్లాడుకుంటాడు.
అదే ఈరోజు ఆయన్ని పిసిసి పీఠం మీద కూర్చోబెట్టింది.
పిసి సి చీఫ్ కాకముందే..
తనని అడ్డుకున్న వాళ్లని..
ప్రతిరోజూ అడ్డు చెప్పే వాళ్ళని ..
తను ఎదగకుండా అడ్డుపడ్డవాళ్ళని లెక్కచేయని రేవంత్..
ఇప్పుడు పిసిసి పగ్గాలు వచ్చాక  వీళ్లందరినీ లెక్క చేస్తాడా?
అందరినీ కలుపుకుని పోతాడా……

కాంగ్రెస్ లో చేరేనాటికి రేవంత్ పరిస్థితి  వేరు.
అప్పటికే టీడీపీకి తెలంగాణలో కాలం చెల్లింది.
అప్పుడప్పుడే వోటుకి నోటు కేసు మరకలు వదిలించుకుంటున్నాడు.
ఇటుకేసుల భయం..అటు రాజకీయ శూన్యం..
ఆ పరిస్థితుల్లో అప్పుడు రేవంత్ కి కాంగ్రెస్ పార్టీ  కావాలి.
కానీ, ఈ అయిదేళ్ళలో సీన్ మారిపోయింది.
కాంగ్రెస్ కి తలదాచుకోడానికి వెళ్ళిన రేవంత్.. ఆ పార్టీకి తలమానికంగా మారాడు.
తలా ఒక దిక్కుకు లాగే కాంగ్రెస్ లో రేవంత్ ఒక దిక్సూచిలా నిలిచాడు.
కేసిఆర్ ని ఒక మాట అనడానికి భయపడే కాంగ్రెస్ లో
రేవంత్ ఒక సునామీ లా రెచ్చిపోయాడు.
ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్ పి గా గెలిచాడు.
ఏనాటికైనా కాంగ్రెస్ కి గెలుపురుచి చూపించగలిగేది.. రేవంత్ ఒక్కడే అని సగటు కాంగ్రెస్ కార్యకర్త అనుకునేలా చేసాడు.
ఇప్పుడు  రేవంత్ కి కాంగ్రెస్ కంటే…
కాంగ్రెస్ కి రేవంత్ ఎక్కువ  అవసరమనే పరిస్థితి.
మరి ఈ పరిస్థితిలో రేవంత్ అందరినీ కలుపుకుని వెళ్తాడా?
పోనీ..అలా వెళ్తే, కాంగ్రెస్ ఒక్కడుగు అయినా ముందుకు నడుస్తుందా..
కాంగ్రెస్ కి ఇప్పుడు కావలసింది కలుపుకుని వెళ్ళడం కాదు.
తోసుకుని వెళ్ళడం.
నసిగే వాళ్ళని, గొణిగేవాళ్ళని,
కసిరేవాళ్ళని, కయ్యాలకు దిగేవాళ్ళని..
అందరినీ ఒక కట్టకట్టి.. తన దారిలో నెట్టేసుకుంటూ వెళ్ళడం.
అనుకున్నది సాధిస్తే.. అలకలన్నీ అటకెక్కిపోతాయి.
గెలుపు హోరు లో గొణుగుళ్లు., సణుగుళ్లు ఎవరికీ వినపడవు..
ఉమ్మడిరాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఇలాగే గెలిచాడు.
పార్టీని గెలిపించాడు.
ఇప్పుడు రేవంత్ కూడా ఇదే చేస్తాడు.
గెలుస్తాడా..  లేదా..  అన్నది
ఎన్నికల తెరమీద చూడాల్సిందే..

-కే.శివప్రసాద్

Also Read : కాంగ్రెస్ నేత విహెచ్ కు రేవంత్ పరామర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్