OTT vs theatre tussle continues :
తెలుగు సినిమా హీరోకు బ్లడ్డు, బ్రీడూ ముఖ్యం అని హీరోలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాబట్టి మనకు ఆ విషయంలో సందేహాలు ఉండాల్సిన పనిలేదు. ముఖం మీద ముడుతలు పడ్డ ముసలి తాత హీరోనే. ఆ ముసలి కొడుకు హీరోనే. ఆ కొడుకు పడుచు కొడుకు హీరోనే. ఆ పడుచు కొడుకు ఒళ్లో పాలపీకతో కనిపిస్తున్న పసిబాలుడు కూడా కాబోయే గొప్ప హీరోనే. హీరో అన్న మాటకు వ్యుత్పత్తి అర్థం హీరో కొడుకు అని ఎప్పుడో మారిపోయింది.
జనం మీద బలవంతంగా రుద్దబడిన వారసత్వ బ్లడ్డు, బ్రీడూ హీరోలందరూ నటశూన్యులని, నట విరూపులని, నట భయంకరులని గంపగుత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు. వారసత్వం ఎంట్రీ వరకు అడ్వాంటేజ్ అయినా…తరువాత తమను తాము పదును పెట్టుకుని పరుగులో నిలబడేవారు కూడా ఉన్నారు. అయితే వారి వారసత్వ భజనల ముందు మాత్రం మరాఠీ భజనలు కూడా మూగబోవాల్సిందే.
అలాంటి వంశపారంపర్య, సహజ, పుట్టు హీరోలతో పోలిస్తే తెలుగులో శర్వానంద్, నాని వైవిధ్యమయిన హీరోలు. బ్లడ్డు, బ్రీడూ వారసత్వ భుజకీర్తులు, దైవాంశ గాలి మేడలు, తాతలు తాగిన నేతుల నీతులు, తండ్రులు తన్నిన రికార్డుల శిఖరాలు లేకుండా సొంత కాళ్లమీద నడుస్తున్నవారు. మన పొరుగింటి అబ్బాయిల్లా కనపడే సామాన్య గుణమేదో ఉన్నవారు. అదే వారికి ప్లస్. ఒక్కోసారి అదే మైనస్.
వారసత్వ ముద్ర బిళ్ల లేకుండా మొహానికి రంగు పూసుకున్న హీరోల రంగు వెలవెలపోయేలా వారసత్వ కథానాయకులు ఏయే కుట్రలు ఏ స్థాయిలో చేస్తూ ఉంటారు అన్నది ఎవరూ రాయలేని ఒకానొక విషాద స్క్రీన్ ప్లే. అది వేరే కథ.
కరోనా కాలంలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలా? లేక ఓ టీ టీ లో రిలీజ్ చేయాలా? అన్నది ప్రశ్న. చేసిన సినిమాను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెడితే కుళ్లి పోయి, కంపు కొడుతుంది.రిలీజ్ చేయకపోతే హీరో పరువుకు నష్టం. చేస్తే నిర్మాతకు నష్టం. చూస్తే ప్రేక్షకులకు కష్టం – నష్టం రెండూను.
ఓ టీ టీ లో అన్నా రిలీజ్ చేసుకుంటే చిల్లర ఖర్చులకన్నా డబ్బులు జేబులో పడతాయి కదా? అని నిర్మాతకు ఆశతో కూడిన దిగులు నుండి పుట్టిన ఆదుర్దా తెచ్చిన ఆందోళన. మల్టీ ప్లెక్స్ పెద్ద తెరలు పట్టనంతగా ఎదిగిన తమ హీరో ఇమేజ్…ఓ టీ టీ విడుదలతో నాలుగు బై మూడు అంగుళాల మొబైల్ స్క్రీన్ లెవెల్ కు పడిపోతుందే అని హీరోలకు బాధతో కూడిన వైరాగ్యం వల్ల జనించిన నిర్వేదం.
నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఓ టీ టీ విడుదలకు ముహూర్తం పెట్టుకున్నారు. అదే రోజు థియేటర్ విడుదలకు ఇంకేదో తెలుగు సినిమాకు ముహూర్తం కూడా కుదిరినట్లుంది. మా థియేటర్లకు ఈ ఓ టీ టీ టక్ అడ్డొస్తుంది…రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాలి అన్నది ఎగ్జిబిటర్ల డిమాండు లాంటి బెదిరింపు.కరోనాతో ఎన్నెన్నో కుదేలైపోయాయి. అందులో సినిమాకు కూడా సినిమా కష్టాలే వచ్చాయి. నాని ఈమధ్య కొంచెం అసహనంగా ఉన్నట్లున్నాడు. అతని బాధ అతనిది. ఎగ్జిబిటర్లు ఇంత మాటంటారా? నన్ను ఇండస్ట్రీకి పరాయివాడిగా చూస్తారా? నా సినిమా థియేటర్లో రిలీజ్ కాదు…ఓ టీ టీ రిలీజ్ కు అభ్యంతరాలు చెబుతున్నారు…ఇలా తెగేదాకా లాగితే…నా సినిమా బ్యాన్ కావడం కాదు…నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా…అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
తెర మీద కనిపించే కథ వేరు. తెర వెనుక కథలు వేరు. ఆ కథలేవో నాని మనసును గాయపరిచినట్లున్నాయి. అవి అందరికీ తెలిసిన కథలే అయినా…ఎవరికీ తెలియనట్లు నటించే కథలు.
హీరో గారూ! హీరో గారూ! ఇంతోటి మీ నటనకు ఇరవై అయిదు కోట్ల పారితోషికం ప్లస్ కొన్ని ఏరియా రైట్స్ కలిసి తడిసి మోపెడై యాభై కోట్లు ఎందుకవుతోందని హీరోను అడగలేని నిర్మాతది ఒక కథ.
వేసిన గడ్డివాము సెట్టుకు, పేర్చిన అట్టపెట్టెల ఇంటికి అయిదు కోట్లు ఎందుకవుతోందని దర్శకుడిని అడగలేని నిర్మాతది ఒక కథ.
వరిచేలో కొంగుజారే పాటకు స్వీట్జర్లాండ్ ఆల్ఫ్స్ పర్వతాల్లో ఎందుకు కాలు జారి కట్టు కట్టుకోవాల్సి వస్తుందో మౌన ప్రేక్షకుడికి అర్థం కాని కథ.
అందరూ ఖర్చు తగ్గించుకోవాలని ఆదర్శ ప్రవచనాలు చేసే అగ్ర హీరోలు ఎందుకు పైసా అయినా తమ పారితోషికం తగ్గించుకోరో అర్థం కాని కథ.
మల్టీపెక్స్ దోపిడీల దెబ్బకు ఇంట్లో సెల్ ఫోన్లో అయినా సినిమాను చూసుకోవడం ఉత్తమం అని సామాన్యుడికి కలిగిన ఎరుక అన్నిటికంటే అసలయిన కథ.
ఇన్ని కథల మధ్య ఎగ్జిబిటర్లు హీరోను బెదిరించడం ఒక ఉప కథ. ఎవరు ఎవరిని రద్దు చేస్తారు లేదా చేసుకుంటారు అన్నది తాత్వికమయిన ప్రశ్న.
నేల విడిచి సాము చేసిన దేన్నయినా ప్రకృతి నిర్దయగా రద్దు చేస్తుంది. కొంచెం కళ్లు తెరిచి చూస్తే భవిష్యత్తులో రద్దయ్యే వాటిలో థియేటర్లే ముందు వరుసలో ఉంటాయి.
కొన్ని కథలను మనం రాస్తాం. కొన్ని కథలను కాలం రాస్తుంది. కరోనా కాలం రాసిన కథలు ఎగ్జిబిటర్లకు సరిగ్గా అర్థమయినట్లు లేదు.
ఇది-
చిన చేపను పెద చేప;
ఆ పెద చేపను తిమింగలం;
ఆ తిమింగలాన్ని కాలం మింగే మాయాబజార్ కథ!
ఎవరిని ఎవరూ రద్దు చేయలేరు. కాలమే అన్నిటిని రద్దు చేస్తూ ఉంటుంది!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read: భజన చేసే విధము తెలియండి!
Also Read: ఇమేజ్ చట్రంలో