Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో యూ ముంబా, యూపీ యోధ, హర్యానా స్టీలర్స్ జట్లు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించాయి
యూ ముంబా- తమిల్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 35-33తో ముంబై విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 26-11తో ముంబై భారీ ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో తలైవాస్ దూకుడుగా ఆడి 22-9తో ఆధిక్యం సంపాదించినప్పటికీ తొలి భాగంలో ముంబై సాధించిన ఆధిక్యాన్ని దాటలేకపోయారు. దీనితో ముంబై రెండు పాయింట్ల స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ 10 పాయింట్లు సాధించాడు.
యూపీ యోధ – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 39-35తో యూపీ గెలుపొందింది. మొదటి 22-18తో టైటాన్స్ ఆధిక్యం సంపాదించినా ఆ జోరును కొనసాగించలేకపోయింది. రెండో భాగంలో యూపీ పుంజుకుని 21-13 తో పైచేయి సాధించి నాట్లుగు పాయిట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో తెలుగు టైటాన్స్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. తెలుగు టైటాన్స్ ఆటగాడు రజనీష్-13; యూపీ రైడర్ సురేందర్ గిల్ 12 పాయింట్లు సాధించారు.
హర్యానా స్టీలర్స్ – జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 35-28తో హర్యానా విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 18-14తో ఆధిక్యం ప్రదర్శించిన హర్యానా రెండో భాగంలోనూ పట్టు సడలనీయకుండా అదే ఆట తీరు చూపి 17-14తో జోరు సాగించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఏడు పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. హర్యానా కెప్టెన్ వికాస్ ఖండాలా 10 పాయింట్ల మార్కు సాధించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (57 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (55); బెంగుళూరు బుల్స్ (54); హర్యానా స్టీలర్స్ (53); యూముంబా(48); యూపీ యోధ(47) టాప్ సిక్స్ లో ఉన్నాయి.