బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం గా జరుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కు స్వేచ్ఛ లభించిన రోజని, ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం పేరిట బిజెపి నిర్మల్ లో నిర్వహించిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఎంఐఎం కు భయపడేవాళ్ళు భయపడతారేమో… బీజేపీ భయపడదని అమిత్ షా అన్నారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానన్న కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడన్నారు. నిజాం పాలనలో నిర్మల్ లో 1000 మందిని ఉరితీశారు… ఇది గుర్తుకు రావడంలేదా కేసీఆర్ అన్నారు. ఆ 1000 మంది అమరుల త్యాగాన్ని వృధా కానివ్వం… ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించి తీరుతామని అమిత్ షా పేర్కొన్నారు.
బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రజల కోసమే స్టార్ట్ చేశారన్న అమిత్ షా బండి సంజయ్ తో పాదయాత్ర చేస్తున్న అందరికీ శుభాకాంక్షలన్నారు. 119 నియోజకవర్గాలలో బండి పాదయాత్ర పూర్తి చేసుకుని వస్తారని, ప్రజల కోసం, ఆదివాసీల కోసం, తెలంగాణ కోసం, అందరికోసం బండి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.
ఎంఐఎం కు వ్యతిరేకంగా…ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బండి పాదయాత్ర సాగుతోందని, ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల ను ఎలా పక్కన బెట్టాడో మనకి తెలుసు అని అమిత్ షా చెప్పారు. తెలంగాణ లో కుటుంబ పాలనే తప్ప ఇంకేమీ లేదన్నారు. అయ్య, కొడుకు, కూతురు(పితాజీ, నేత, బేటీ)మాత్రమే పాలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లో trs కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని, తెలంగాణలో trs కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే అని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం వచ్చేది ఎంఐఎం ను తరిమికొట్టినప్పుడే అన్నారు. కారు కేసీఆర్ ది…. కానీ దాని స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని ఘాటుగా విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మాట ఇస్తున్నానని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేమేంటో చూపిస్తామని అమిత్ షా చెప్పారు. ఏ ఎన్నికైనా డబ్బుతో గెలవొచ్చని trs అనుకుంటోందని, మనమేంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. 2023లో తెలంగాణలో పక్కా గెలుస్తాం…119 అసెంబ్లీ స్థానాలను మోదీ సంచిలో వేస్తామని అమిత్ షా అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు.