ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై కేంద్ర హెం శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతుందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని, ఎన్డీయేలోకి కొత్తమిత్రులు వస్తున్నారని, అతి త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘మా మిత్రులను మేమెప్పుడూ బైటకు పంపలేదు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణల దృష్ట్యా వారే బైటకు వెళ్ళారు’ అంటూ అమిత్ పేర్కొన్నారు. కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుందని, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని చెప్పారు.
మూడు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్దాలను కలుసుకుని చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే వైసీపీ అధ్యక్షుడు, సిఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు.
తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎన్డీయేలో తెలుగుదేశం చేరికను ధృవీకరిస్తున్నాయి. వచ్చే వారం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో లాంఛనంగా దీనిపై అ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.