ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు.
పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఓవైసీ సూచించారు. అదే విధంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ మీడియంలో కోచింగ్ సెంటర్లను నిర్వహించాలన్నారు. పాతబస్తీలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయన్నారు. అందరమూ కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దామని ఓవైసీ పిలుపునిచ్చారు. సభ సజావుగా నడిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓవైసీ అభినందనలు తెలిపారు.