విజయనగరంలోని మన్సాస్ ట్రస్టు వ్యవహారం ఈరోజు మరో మలుపు తిరిగింది. ట్రస్టు ఛైర్మన్ గా తనను నియమించాలంటూ ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు సోదరుడు, మాజీ ఛైర్మన్ ఆనందగజపతి రాజు రెండో భార్య సుధ కూతురు ఊర్మిళ.
2016లో ఆనంద గజపతిరాజు మరణం తర్వాత అయన సోదరుడు, అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2019 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత 2020 మార్చిలో అశోక్ గజపతి స్థానంలో ఆనంద గజపతి రాజు మొదటి భార్య ఉమా కుమార్తె సంచయితను ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అశోక్ గజపతి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం 2021 జూన్ 16 న ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. అశోక్ మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
తాజాగా ట్రస్టు చైర్మన్ గా తనను నియమించేలా ఆదేశాలివాలని ఊర్మిళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు రేపు విచారించనుంది.