కోవిడ్ మూలాలు లోతుగా శోధించి చైనాను దోషిగా నిలబెట్టేందుకు అమెరికా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కోవిడ్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందనే విషయాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, కోవిడ్ మూలాలను పూర్తిగా పారదోలాల్సి ఉంటుందని, అదే సమయంలో ఇలాంటి మరో మహమ్మారి రాకుండా జాగ్రత్త పడాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్ స్పష్టం చేశారు. కోవిడ్ పుట్టు పూర్వోత్తరాలు శోధిస్తున్న తీరు అసమగ్రంగా ఉందని పలు దేశాలు, వైద్య నిపుణులు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో బ్లింకెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కోవిడ్ మూలాలు లోతుగా అధ్యయనం చేసేందుకు జో బిడెన్ యంత్రాగం కట్టుబడి ఉందని బ్లింకెన్ తేల్చి చెప్పారు. అయితే చైనా తమకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమాచారాన్ని పారదర్శకంగా వెల్లడించాలని, ఈ విషయంపై పరిశోధిస్తున్న అంతర్జాతీయ బృందానికి తమ వంతు సహకారం అందించాలని, లేకపోతే ఈ మహమ్మారి వ్యాప్తికి చైనానే కారణమని భావించాల్సి ఉంటుందని అన్నారు.
మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేసి అమెరికాతో పాటు ఇతర దేశాలు కోవిడ్ తో జరిగిన నష్టానికి చైనా నుంచి అపరాధం వసూలు చేయాలన్నారు. ఈ మహమ్మారికి చైనా బాధ్యత వహించాలి, తగిన మూల్యం చెల్లించాలి అన్ని ట్రంప్ డిమాండ్ చేశారు. నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ పది ట్రిలియన్ డాలర్ల పరిహారాన్ని చైనా నుంచి వసూలు చేయాలని, అయినా ఇది తక్కువేనని వ్యాఖ్యానించారు. వర్తక వాణిజ్యాలకు సంబంధించి చైనాకు బాకీ పడిన దేశాలు కోవిడ్ పెనాల్టీ కింద కొంత సొమ్ము మినహాయించుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదని, వాస్తవాలు, శాస్త్రీయత ను మరుగుపరిచి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునుందుకే తమపై విమర్శలు చేస్తున్నారని చైనా బదులిస్తోంది.