Sunday, September 22, 2024
HomeTrending Newsగన్నవరంలో పోటీ చేద్దాం: వంశీ సవాల్

గన్నవరంలో పోటీ చేద్దాం: వంశీ సవాల్

గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, లోకేష్ ను పోటీ చేయించి గెలిపించాలని  వల్లభనేని వంశీ సవాల్ విసిరారు.  చంద్రబాబు నిరసన దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై వంశీ స్పందించారు.  సునీతను తాను టిడిపి నాయకురాలిగా చూడనని, ఒక వదినగా భావిస్తానని చెప్పారు. లోకేష్ ను గన్నవరంలో పోటీ చేయించేలా సునీత ఒప్పించి అయన తరపున ఎన్నికల్లో ఆమె సారధ్యం వహించాలని వంశీ సూచించారు. తండ్రీ కొడుకులు బాబు, లోకేష్ లకు దమ్ముంటే గన్నవరం రావాలని  ఛాలెంజ్ చేశారు. లోకేష్ ఈ మధ్య పీకుతా అంటూ అసభ్య భాష వాడుతున్నారని, దమ్ముంటే గన్నవరంలో పోటీ చేయొచ్చన్నారు.

2012లో కొడాలి నాని టిడిపి వీడి వైసీపీలో చేరినప్పుడు చంద్రబాబు తనను యాంటీ రూమ్ లోకి పిలిచి నానిని దూషించాలని, దేవినేని ఉమా స్థానంలో జిల్లా బాధ్యతలు తనకు అప్పగిస్తానని చెప్పారని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గతంలో దేవినేని నెహ్రూ విషయంలో కూడా అలాగే తిట్టమని చంద్రబాబు చెప్పినందుకే నెహ్రూతో వైరం తెచ్చుకొని మర్డర్ కేసుల వరకూ వెళ్లిందని… దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు సూచనను అప్పట్లో తాను తిరస్కరించానని వంశీ వెల్లడించారు. నాని-తాను స్నేహితులమని, మా పిల్లలు- వారి పిల్లల మధ్య కూడా స్నేహం ఉందని అలాంటి నానిపై విమర్శలు చేయలేనని స్పష్టంగా చెప్పానని వివరించారు

కౌటిల్యుడి చాణక్య నీతిని బాబు అనుసరిస్తారని, పంచతంత్రం రాసింది విష్ణు శర్మ అయితే దాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నది చంద్రబాబేనని, మిత్ర లాభం, మిత్ర బేధం అంశాలు అయన వాడుకున్నట్లు ఎవరూ వాడుకోలేరని వ్యాఖ్యానించారు. తల్లికీ, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు మధ్య కూడా గొడవ పెట్టగల సమర్ధుడు చంద్రబాబు అని వంశీ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎన్టీఆర్, పరిటాల రవి తిట్టినన్ని తిట్లు వేరెవరూ తిట్టలేదని, వారినే తాను, కొడాలి నాని అనుసరిస్తున్నామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్