వరలక్ష్మి శరత్ కుమార్ .. ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. తమిళ .. తెలుగు భాషల్లో ఆమె బిజీ ఆర్టిస్ట్. వరలక్ష్మి ముందుగా హీరోయిన్ గానే ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే శరత్ కుమార్ కూతురుగా ఆమె రావడం వలన, గ్లామరస్ రోల్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో హీరోయిన్ గా ఆమె ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. దానికి తోడు హీరోయిన్ గా చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోలేదు కూడా.
ఈ నేపథ్యంలోనే ఆమె తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కీలకమైన పాత్రలను చేయాలని నిర్ణయించుకుంది. అలా తన రూట్ మార్చుకున్న ఆమెకి నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర ఒకటి వచ్చింది. ఆ పాత్రలో ఆమె తానేమిటనేది నిరూపించుకోవడంతో, అదే తరాహా పాత్రలు రావడం మొదలుపెట్టాయి. నిండుగా .. నిబ్బరంగా కనిపిస్తూ, కళ్లతోనే శాసించేలా ఉండే ఆమె నటన ఆమెకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలో ఆమె పాప్యులర్ అయిందో, అప్పటి నుంచి తెలుగు నుంచి అవకాశాలు వెళ్లడం మొదలైంది.
అలా ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘క్రాక్’ .. ‘నాంది’ .. ‘యశోద’ .. ‘వీరసింహా రెడ్డి’ సినిమాలలో చేసిన పవర్ఫుల్ పాత్రలు ఆమె నటనకి కొలమానంగా నిలిచాయి. ఈ నెల 3న రానున్న ‘మైఖేల్’లోను ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది. ఇక నాయిక ప్రధానమైన ‘శబరి’ లైన్లోనే ఉంది. వరలక్ష్మిని దృష్టిలో పెట్టుకునే పాత్రలను డిజైన్ చేసే స్థాయికి ఆమె వచ్చేసింది. ప్రస్తుతం రెండు భాషల్లోను ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా ఉందంటే, ఎంత బిజీనో అర్థం చేసుకోవచ్చు. తనని తాను మలచుకోవడం .. ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం వరలక్ష్మి విషయంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండటమే విశేషం.