Sunday, January 19, 2025
HomeTrending NewsVelama: వెలమల కంచుకోటల్లో బీటలు

Velama: వెలమల కంచుకోటల్లో బీటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వెలమల ఖిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లాలో క్రమంగా వారి ఆధిపత్యానికి గండి పడుతోంది. బలహీన వర్గాల ప్రాబల్యం పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన వెలమలు తెలంగాణ వచ్చాక కొంత వరకు కొనసాగించారు. 2014, 2018 ఎన్నికలతో పోల్చితే ఈ దఫా కొంత భిన్న రాజకీయం కనిపిస్తోంది. కొన్ని నియోజక వర్గాలను విశ్లేషణ చేస్తే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కరీంనగర్ నియోజకవర్గం వెలమల గడీ అని ఒకప్పుడు పేరు ఉంది. తొమ్మిది సార్లు ఇక్కడి నుంచి ఈ సామాజిక వర్గం వారే ప్రాతినిధ్యం వహించారు. ఇతరులు అడపాదడపా వచ్చినా వీరి కనుసన్నల్లోనే మసలుకునేలా చక్రం తిప్పేవారు. బీసి వర్గానికి చెందిన గంగుల కమలాకర్ 2009లో గెలిచాక వెలమల పట్టు తగ్గటం ప్రారంభమైంది.

2009లో కాంగ్రెస్ నుంచి చల్మెడ లక్ష్మినరసింహారావు(ఇప్పుడు వేములవాడ్ బీఆర్ఎస్ అభ్యర్థి) ప్రజారాజ్యం నుంచి కటారి దేవేందర్ రావు, బిజెపి నుంచి సుగుణాకర్ రావు(అందరు వెలమ)) పోటీ చేయగా వీరందరితో తలపడి గంగుల జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత మూడుసార్లు ఆయనే గెలిచి.. నాలుగో దఫా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

2014లో చల్మెడ లక్ష్మి నరసింహారావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఏకంగా మూడో స్థానంలోకి వెళ్ళారు. రెండో స్థానంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ నిలిచారు. 2018లో ప్రధాన పార్టీలు అన్నీ బిసి అభ్యర్థులనే బరిలోకి దించాయి. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బిజెపి నుంచి బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి గంగుల తలపడ్డారు. ఆ విధంగా కరీంనగర్ ఇప్పుడు బలహీన వర్గాల పరమైంది. 2023 ఎన్నికల కోసం ఏకంగా ముగ్గురు మున్నూరు కాపు సామాజిక వర్గం వారే బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ దఫా ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితే మరికొన్ని నియోజకవర్గాల్లో నెలకొనే వాతావరణం కనిపిస్తోంది.

కోరుట్ల 

కోరుట్ల నియోజకవర్గం తీసుకుంటే మరో కరీంనగర్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. బుగ్గారం, మెట్ పల్లిల నుంచి విడగొట్టి కోరుట్ల ఏర్పాటు చేశారు. 2009 నుంచి కల్వకుంట్ల విద్యాసాగర రావు గెలుస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. గులాబీ అధినేత కెసిఆర్ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు నియోజకవర్గంలో సంజయ్ అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

తీరా బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగగానే కోరుట్ల రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబల్యం కలిగిన మున్నూరు కాపులు ఏకం అవుతున్నారు. పార్టీలకు ఆతీతంగా అరవింద్ కోసం ఏకతాటి మీదకు వస్తున్నారు. కోరుట్ల పట్టణంలో అన్ని సామాజిక వర్గాల యువత, పద్మశాలి వర్గం అరవింద్ కు జై కొడుతున్నారని సమాచారం ఉంది.

బయటకు కనిపించకపోయినా పట్టణంలో హిందూ – ముస్లిం వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ముస్లిం ప్రాంతాల్లో నివసించే హిందువులను ఇబ్బందులు పెడుతున్నారని, పండుగల సమయాల్లో కరెంటు కోతలు, కుళాయిలు రాక మంచినీటి కోసం ఎదురు చూపులు తదితర సమస్యలు గొడవలకు దారితీస్తున్నాయి. ఇటీవల దసరా, బతుకమ్మ పండుగలకు అదే జరగిందని మహిళలు వాపోతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైనారిటీల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని..ఓ ముస్లిం నేత కబ్జాలకు అంతు లేదని ఆరోపణలు ఉన్నాయి. ధర్మపురి అరవింద్ రాకతో పట్టణంలో అన్ని వర్గాల బిసి ఓటర్ల వైఖరిలో మార్పు కన్పిస్తోంది. ఇదే విధానం కొనసాగితే కోరుట్లలో కూడా వెలమల ఆధిపత్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది.

వేములవాడ 

వేములవాడలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మినరసింహారావు, బిజెపి నుంచి చెన్నమనేని వికాస్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్, బిజెపిల నుంచి ఇద్దరు వెలమ సామాజిక వర్గం కావటంతో బీసీ కాన్సెప్ట్ వస్తోంది. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వర్గం కొత్త అభ్యర్థికి అంతగా సహకరించటం లేదని…మండల, గ్రామ స్థాయిలో వెలమల ఆధిపత్యం పెరిగిందనే విమర్శలు ఉన్నాయి.

అయితే ఆది శ్రీనివాస్ గెలిస్తే భూకబ్జాలు, రౌడీయిజం పెరుగుతుందనే పుకార్లు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. ఇటీవల ఆది శ్రీనివాస్ అనుచరులు చందుర్తిలో చేసిన గొడవతో ఓటర్లు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ ప్రచారంతోనే గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆది శ్రీనివాస్ కు ఈ దఫా అవే ఆరోపణలు ప్రతికూలంగా మరే ప్రమాదం ఉంది. అయితే నాలుగుసార్లు ఓడిపోయారనే సానుబూతి కొంత కలిసి రానుంది. దీంతో ఇక్కడ కూడా వెలమలు గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్నారు.

జగిత్యాల 

జగిత్యాల నియోజకవర్గం ఏర్పడ్డ కొత్తలో బుట్టి రాజారామ్, రాజేశం గౌడ్ లు తలా ఒకసారి ఎల్ రమణ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. బలహీన వర్గాల నుంచి వీరు మినహా అందరు రెడ్డి, వెలమ సామాజిక వర్గాల వారే గెలుస్తున్నారు. ఈ దఫా బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బిజెపి నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ భోగ శ్రావణి తలపడుతున్నారు.

ఇటీవలి వరకు తమదే గెలుపు అని ధీమాగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బిజెపి అభ్యర్థి ఎవరిని దెబ్బతీస్తుందో అనే భయం పట్టుకుంది. మాజీ బీఆర్ఎస్ నేత కనుక గులాబీకి నష్టం జరుగుతుందని భావించారు. ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయి. మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గాల మధ్య ఒప్పందం జరిగిందని.. కోరుట్లలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు పద్మశాలి పెద్దలు సహకరించాలని..జగిత్యాలలో మున్నూరు కాపులు భోగ శ్రావణికి సహకరించేలా రాష్ట్ర స్థాయి నేతలు కుల పెద్దలను ఒప్పించారని సమాచారం.

ఈ రెండు వర్గాలకు తోడు మరికొన్ని బిసి కులాలు, దళిత, గిరిజనులు తోడైతే జగిత్యాల నియోజకవర్గంలో కూడా వెలమల ప్రాబల్యం క్షీణిస్తుందని అంటున్నారు. బిసి నినాదం బలపడితే జగిత్యాల, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాలు… 2023 ఎన్నికల్లో కరీంనగర్ తొవ్వలో నడుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్