తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళు వీఆర్ఎస్ కి అర్హులుగా పేర్కొన్నారు. కొందరు ఉద్యోగుల వినతి మేరకు వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చినట్టు ప్రకటనలో వెల్లడించారు. విఆర్ ఎస్ కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఖర్చును తగ్గించాలంటే ఉద్యోగుల సంఖ్యను కుదించటమొక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టడం మినహా గత్యంతరం లేదనే ఉద్దేశంతో ఉన్నారు.
సర్వీసుల సంఖ్య కుదింపు, దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు ‘మిగులు’గా మారినట్టు తేలింది. మిగులు ఉద్యోగులు ఉండటం, రిటైర్మెంట్లు లేకపోవటంతో ప్రొడక్టివిటీ తగ్గి జీతాల భారం పెద్ద సమస్యగా మారిందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం పరిష్కారమనే తమ అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం.