కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమైందని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూడేళ్ళలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సిఎం జగన్ చెప్పారని కానీ ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని టిడిపి శాసనసభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం ఇవ్వలేదని సభ దృష్టికి తీసుకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం విభజన చట్టంలో ఉందని దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని, ఎప్పటిలోగా కడప ప్లాంట్ పూర్తి చేస్తారో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి బుగ్గన జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం చేయాలని చట్టంలో లేదని, పరిశీలించవచ్చు అని మాత్రమే ఉందని చెప్పారు. తాము స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టమని, ఆ వెంటనే కోవిడ్ రావడంతో ఆలస్యం అయ్యిందని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం కోసం 37 కోట్లు విడుదల చేశామమన్నారు. రాయలసీమ పవర్ ప్లాంట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసిన టిడిపి ప్రభుత్వం ఐదేళ్ళలో ఏం చేసిందని, హడావుడిగా ఎన్నికలకు నెలరోజుల ముందు శంఖుస్థాపన చేశారని బుగ్గన వివరించారు.
తాము డిసెంబర్ 23, 2019న కడప ప్లాంట్ కు శంఖుస్థాపన చేశామని అయితే ఆ తర్వాత మూడు నెలల్లోనే కోవిడ్ మహమ్మారితో ప్రపంచమే ఆగిపోయిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు పరిశ్రమలపై మాట్లాడే అర్హతే టిడిపికి లేదని బల్క్ డ్రగ్ పార్క్ రాష్ట్రానికి వస్తే వద్దు అని రాసిన టిడిపి నేతలు ఇప్పుడు ఏ మొహంతో మాట్లాడుతున్నారని ఘాటుగా ప్రశ్నించారు. జాయింట్ వెంచర్ తో ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నామని, అవసరమైతే ప్రభుత్వమే సొంతంగా నిర్మించేదుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రశ్నోత్తరాల్లో కడప స్టీల్ ప్లాంట్ తో పాటు దేవాలయాల కూల్చివేత, వైద్య కళాశాలల నిర్మాణం, డ్వాక్రా రుణాల మాఫీ, గృహనిర్మాణంపై ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు.