Costly Business: మధురాంతకం రాజారామ్ జగమెరిగిన కథా రచయిత. నిత్యం మనమధ్య కనిపించే అతి సాధారణ పాత్రల్లో దాగిన అసాధారణ విషయాలను కథల్లో బంధించిన గొప్ప కథకుడు. కథ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో వివరిస్తూ కథా శిల్పం పేరిట మధురాంతకం ఒక వ్యాసం రాశారు. అందులో ఒక చోట- “గోడ మీద తుపాకి ఉంది” అని కథలో వర్ణిస్తే…కథ అయిపోయే లోపు ఆ తుపాకీని వాడాలి. లేదంటే అనవసరంగా మీరు ఆ తుపాకీతో పాఠకుడిని భయపెడుతున్నారు…అని అంటారు. ప్రస్తుతం మన చర్చ ఆయుధాల గురించి కాబట్టి…కథా శిల్పాన్ని పక్కనబెట్టి వంచనా శిల్పం సంగతేమిటో చూద్దాం.
కర్ర ఉన్నది కొట్టడానికే.
కత్తి ఉన్నది కోయడానికే.
తుపాకీ ఉన్నది కాల్చడానికే.
బాంబు ఉన్నది విసరడానికే.
సైన్యం ఉన్నది చంపడానికే…లేదా చావడానికే.
యుద్ధం- శాంతి పరస్పర విరుద్ధ భావనలు. శాంతి కోసం యుద్ధం జరుగుతున్నట్లు భ్రమ కలుగుతుంది. యుద్ధంలో, యుద్ధంతో శాంతి దొరకదు. ఏ యుద్ధమూ శాంతిని కోరుకోదు. శాంతిని కోరేవారు యుద్ధం జోలికే వెళ్లరు. యుద్ధానికి పగ, ప్రతీకారం, జాతివైరం, కోపం, అవమానం, అధికారం, ధనదాహం, ఆక్రమణ, పెత్తనం, పైశాచికత్వం, రాక్షసత్వం, ఉన్మాదం…లాంటి సవాలక్ష అవలక్షణాలు కారణాలు.
ఏ యుద్ధంలో అయినా రెండు వైపులా మిగిలేది బూడిదే. ఓడిన వారు నడి వీధిలో ఏడుస్తారు. గెలిచినవారు అంతఃపురాల్లో రహస్యంగా కుళ్లి కుళ్లి ఏడ్చి మొహం కడుక్కుంటారు.
మొదటి ప్రపంచ యుద్ధమునకు కారణములు, ఫలితములు రాసి రాసి ప్రపంచం అలసిపోయింది.
అలాగే రెండో ప్రపంచ యుద్ధమునకు కారణములు, ఫలితములు రాయలేక సొలసిపోతూనే ఉంది. మూడో ప్రపంచ యుద్ధం రాదుగాక రాదు అని ప్రపంచం గుండెలమీద చేయివేసుకుని హాయిగా నిద్రపోదామనుకుంది. రెండో యుద్ధం తరువాత మూడో యుద్ధం…నాలుగో యుద్ధం…అయిదో యుద్ధం…పది…పన్నెండు యుద్ధాలు ఎన్నో జరిగాయి. కాకపొతే ఇవి కంటికి కనిపించని యుద్ధాలు. చరిత్ర రాయని యుద్ధాలు. చరిత్ర కన్నుగప్పిన యుద్ధాలు.
మన యుద్ధాలకు ఇంకెవరో దుర్ముహూర్తం నిర్ణయించి ఉంటారు. మన పగలకు ఇంకెవరో ప్రతీకారాన్ని నూరిపోస్తూ ఉంటారు. మన చేతికి కత్తి ఎవరో ఇచ్చి ఉంటారు. మనం కోయాల్సిన కుత్తుకలను ఇంకెవరో మన ముందుకు తోసి ఉంటారు. మనం తుపాకులు కొనుక్కోలేకపోతే అప్పులు ఎవరో ఇచ్చి ఉంటారు. మనం బాంబులు విసరలేకపోతే శిక్షణ ఎవరో ఇచ్చి ఉంటారు. మనం అణు విధ్వంసం చేయలేకపోతే…ఆ విధ్వంసం అవసరాన్ని ఎవరో చక్కగా బోధిస్తూ ఉంటారు. మనం యుద్ధానికి సిద్ధంగా లేకపోయినా…ఎవరో…ఇంకెవరో…ఎవరెవరో…కనిపించని సాయం చేసి సిద్ధం చేస్తూ ఉంటారు. అడగకుండానే ఆయుధాలు చేతిలో పెట్టి వెళుతూ ఉంటారు. యుద్ధోన్మాదాన్ని ఒక నైతిక ధర్మంగా, జీవన్మరణ సమస్యగా ఎవరో చిత్రీకరించి పెట్టి ఉంటారు.
దేశం ఎందుకు యుద్ధం చేస్తోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. దేశం బూడిదయితే ఏడవాలి. దేశం ఓడిపోతే గుండెలు బాదుకోవాలి. దేశం గెలిస్తే ఎగిరి గంతులు వేయాలి. బతికితే బతకాలి. చస్తే చావాలి. చస్తే నంబర్లుగా మిగలాలి. బతికితే శిథిలాల్లో ఉండాలి.
యద్ధం పెను విధ్వంసమే కావచ్చు. యుద్ధం మానవ నాగరికతకు మాయని మచ్చే కావచ్చు. యుద్ధం భూగోళానికి తీరని తలవంపులే కావచ్చు. యుద్ధం భయవిహ్వలమే కావచ్చు. హితుల్, సుతుల్, బంధువులు పొతే పోవచ్చు. రావణ కాష్ఠం రగిలితే ఆరక రగులుతూ ఉండవచ్చు. కానీ- యుద్ధం కొందరికి అక్షరాలా వ్యాపారం. పెట్టుబడికి అనువైన సందర్భం. కాసులవేటకు తెగే కుత్తుకలు లాభార్జన పాఠాలు.
నిలువునా కాలిపోయి, కూలిపోయే కొందరి జీవితాలు కొందరికి ఏపుగా పెరిగి, వెలిగే వ్యాపార సౌధాలు. చావులో గెలుపు ఉండదు. కానీ…యుద్ధంలో చావు గెలుపు. వీరమరణం పొందితే స్వర్గం తలుపులు బార్లా తీసి ఇంద్రుడే గేటు దగ్గర నిరీక్షిస్తూ ఉంటాడు.
యుద్ధాన్ని బూచిగా చూపి ఆయుధాలు అమ్మేవాడు ఒకడు. యుద్ధానికి ఆజ్యం పోసి మంటలార్పే ఫైర్ ఇంజన్లు అమ్మేవాడొకడు. యుద్ధానికి రెండువైపులా డబ్బులిచ్చి, బాంబులిచ్చి…మూడు రొట్టెల కథలోలా తగువు తీర్చే తక్కెడ పట్టుకుని బయలుదేరేవాడొకడు.
పెద్ద రాజ్యం పేరును తనకు తాను తగిలించుకున్నంత మాత్రాన అమెరికా మనసు పెద్దది కాదు. చాలా చాలా చిన్నది. అమెరికా వ్యాపారానికి మామూలుగానే మనసు ఉండదు. అక్కడి ఆయుధ వ్యాపారులకు అసలు ఉండదు. యూరోప్ నవనాగరికత ప్రపంచ నాగరికతకే నడకలు నేర్పినట్లు తనకు తానే చరిత్ర పాఠాలు రాసుకుంటుంది కానీ…ప్రపంచ యుద్ధాలకు ప్రాణం పోసిందే యూరోప్ దేశాలు. మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాలో పావు వంతు జనాభా కూడా ఉండని యూరోప్ దేశాలు తమ తమ చిల్లర చిల్లర పంచాయతీలను ప్రపంచ యుద్ధాలుగా మార్చి…వారు కూడా శాంతి మంత్రాలకు అర్థాలు చెబుతుంటే…దయ్యాలు వేదాలు వల్లించకుండా ఎలా ఉంటాయి?
తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించగానే అమెరికా, యూరోప్ దేశాల్లో ఆయుధ వ్యాపారుల పంట పండింది. నిజానికి గిచ్చి…ఓదార్చే విద్యలో, అగ్గికి ఆజ్యం పోయడంలో, అప్పులిచ్చి ఆపై కబళించడంలో, లేని తగువులు పెట్టి…పెద్దన్న తీర్పుల పేరిట తలదూర్చడంలో అమెరికాకు అమెరికాయే సాటి. అమెరికాకు తోడుబోయినవి యూరోప్ దేశాలు.
ఉక్రెయిన్ కు అండగా నిలిచి రష్యాపై పోరాటానికి అన్నివిధాలా అమెరికా, యూరోప్ దేశాలు ఎందుకు సహకరిస్తున్నాయోనని తలబాదుకోవాల్సిన పనిలేదు. ఎవరి స్వార్థం వారిది. ఉక్రెయిన్ కు అపారమయిన ఆయుధాలు కావాలి. అనంతంగా డబ్బు కావాలి. అమెరికాలో చాలామంది చట్టసభల సభ్యులు ఆయుధ వ్యాపారులే. వారి ఆయుధాల అమ్మకానికి మార్కెట్ కావాలి. అంటే భూగోళమంతా ఎడతెగని యుద్ధాలు జరుగుతూ ఉండాలి. అమెరికా ఉక్రెయిన్ కు డబ్బిస్తుంది. ఉక్రెయిన్ అదే అమెరికా వ్యాపారుల దగ్గర ఆయుధాలు కొంటుంది. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకోవడం. మధ్యలో విశ్వశాంతి, సంయమనం బూడిదయ్యే అంశాలు. యూరోప్ ఆయుధ వ్యాపారులు సేమ్ టు సేమ్. సిగ్గు, శరం, మానవత్వం, మానవమానాలు దేవాతావస్త్రాలు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక అమెరికా, యూరోప్ ఆయుధ వ్యాపారుల సంపద ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్ల ఆయుధాలు కొత్తగా అమ్ముడుపోయాయో? తెలిస్తే…యుద్ధమే గుండె పగిలి చస్తుంది.
పెద్దాయన మధురాంతకం చెప్పినట్లు…ఆయుధమంటూ తయారు చేస్తే…దాన్ని అమ్ముకోవాలి. అమ్మితే కొనుక్కోవాలి. కొనుక్కుంటే వాడాలి. వాడితే చంపాలి. యుద్ధమే జరగకపోతే ఆయుధాలు కొనేవాడే ఉండడు కాబట్టి…యద్ధాన్ని సృష్టించాలి. వెంటనే యుద్ధం ఆగిపోకుండా నిత్యం రగిలి, పొగిలి, పగిలేలా పెట్రోల్ పోస్తూనే ఉండాలి.
“ఆయుధమేదయినా…ఆయువు పోస్తుందా?
ప్రేమను మించినదా…బ్రహ్మాస్త్రమయినా?”
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :