తాము ప్రకటించిన మొదటి దశ మేనిఫెస్టోను సిఎం జగన్ కూడా మెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తమ హామీలను బిసిబిల్లా బాత్, పులిహోర తో ఆయన పోల్చారని, వాస్తవానికి బిసిబిల్లా బాత్ పౌష్టికాహారమని, పులిహోర రుచిగా ఉంటుందని రెండూ కలిపాం కాబట్టి మేనిఫెస్టో బాగుందని ఆయన కూడా ఒప్పుకున్నారని, తాము బెస్ట్ హామీలు ఇచ్చిన విషయాన్ని ఆయన కూడా గుర్తించినట్లు అయ్యిందని అన్నారు.
విభజన హామీల అమలుపై ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టకుండా కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికే తన అధికారాన్ని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రశ్నిస్తే ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారని.. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత బరితెగించి పాలన చేయలేదని బాబు మండిపడ్డారు. మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని రాబందుల కంటే హీనంగా దోచుకుంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైతే, విడిపోయిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నాడు నవనిర్మాణ దీక్షల పేరుతో పునరంకితం అయ్యామని చెప్పారు.
రాష్ట్రం విడిపోయిన తొమ్మిదేళ్ళ తరువాత కూడా మీ రాజధాని అంటే ఏమిటో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన పాపానికి రైతులు బాధలు పడుతున్నారన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే కేంద్ర కేబినేట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ర ప్రభుత్వానికి అప్పగించిందని చెప్పారు. అన్ని అనుమతులూ తీసుకొని, కోర్టులో వ్యాజ్యాలు గెలిచి, ప్రతి సోమవారం పోలవారంగా ప్రకటించి 72 శాతం పూర్తి చేశామని, కానీ దాన్ని ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో మూలన పడేశారని విమర్శించారు. 2025నాటికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేస్తామంటూ సిగ్గులేకుండా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చి దిద్ది ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ గా ఉండి 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇవన్నీ కార్యరూపం దాల్చితే లక్షలాది మంది కు ఉద్యోగాలు వచ్చేవని దాన్ని కూడా నాశనం చేశారన్నారు.
పూర్ టు రిచ్ కార్యక్రమం ద్వారా పేదలను ధనవంతులుగా తయారు చేస్తామని.. దోచుకున్న వారి నుంచి ఆస్తులు జప్తులు చేసి దాన్ని పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. పి4 ఫార్ములా ద్వారా పేదలను ఆదుకుంటామని పునరుద్ఘాటించారు.