Monday, September 23, 2024
HomeTrending NewsNitin Gadkari: మౌలిక సదుపాయాలతోనే ఉపాధి అవకాశాలు

Nitin Gadkari: మౌలిక సదుపాయాలతోనే ఉపాధి అవకాశాలు

ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుంటారని, అందుకే ఈ ప్రాంతంలో  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత  ఇస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్ వి యునివర్సిటీ స్టేడియంలో రాష్ట్రంలో కొత్తగా 3 జాతీయ రహదారులకు గడ్కరీ శంఖుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజ్ 2,3,4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో శంఖుస్థాపన  చేశారు. 2014 లో తాను కేంద్రమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటికి  ఆంధ్ర ప్రదేశ్ లో 4,193 కిమీ జాతీయ రహదారులు వుంటే, అది నేటికి 8,744 కి.మీ.లకు చేరి దాదాపు రెండింతలు పెరిగాయన్నారు.

మౌలిక సదుపాయలతోనే నిరుద్యోగ  నిర్మూలన చేయగలమని నమ్మిన మన ప్రధాని నరేంద్ర మోడీ నీరు, విద్యుత్, రహదారులు, కమ్యునికేషన్ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. మౌలిక సదుపాయాలు లేకుంటే పారిశ్రామిక పెట్టుబడులు రాక  నిరుద్యోగ సమస్యను తీర్చలేమని అన్నారు. పోర్ట్ లకు ప్రాముఖ్యత కలిగిన ఏపీకి దేశంలోనే ప్రముఖ పోర్ట్ గా ప్రసిద్ది గాంచిన విశాఖపట్నం వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 3 పోర్ట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పోర్ట్ లు దేశాభివృద్ధికి తోడ్పతాయన్నారు. 2023 నాటికి 91 వివిధ ప్రాజెక్టులు 3240 కిమీ రూ.50 వేల కోట్లతో పూర్తి చేస్తున్నామని మరో రూ.75 వేల కోట్లతో 190 ప్రాజెక్టులు పలు దశల్లో వున్నాయని, త్వరలో ఇవి పూర్తవుతాయని అన్నారు. రూ 20 వేల కోట్లతో 25 ప్రాజెక్టులు 800 కిమీ , రూ.50 వేల కోట్లతో 45 ప్రాజెక్టులు 1800 కిమీ ఏర్పాటు కానున్నాయని అన్నారు. ప్రత్యేకంగా  19 వేల కోట్లతో 430 కిమీ పోర్ట్ ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో దాదాపు రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని విదేశీ , దేశీయ పెట్టుబడులతో  పరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపుతున్నారని, దీనికి రవాణా సౌకర్యాలే కారణమని అన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే రూ. 17 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని 2024 నాటికీ పూర్తవుతాయని అంటూ జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో కాశ్మీర్ – కన్యాకుమారి వరకు సూరత్ – చెన్నై, మనాలి, శ్రీనగర్ –జమ్ము వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో వున్నాయని అన్నారు. అన్ని దక్షిణ ప్రాంత రాజధాని నగరాలను అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. బెంగళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్  ఎక్స్ ప్రెస్ హైవే ఎపీలోని 5 జిల్లాల మీదుగా వెళ్లనుందని తెలిపారు. అత్యధికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఈ రహదారులు దోహదం చేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా,  తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి,  ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి,  ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్