ప్రతిపక్షాలు విడిగా వచ్చినా, కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేత, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొలేకే చంద్రబాబు, పవన్ లు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా తాము సత్తా చూపుతామని, ప్రజల మద్దతు సిఎం జగన్ కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ముగ్గురు కలిసి వచ్చినా… నాలుగో వ్యక్తి ఈనాడు పేపర్ యజమానితో కలిసి వచ్చినా తమకేం ఇబ్బంది లేదన్నారు. కానీ విపక్ష నేతలు వాలంటీర్ల వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సుబ్బారెడ్డి యానం లో పర్యటించి పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో సమావేశమయ్యారు. మల్లాడి దంపతులు సుబ్బారెడ్డిని జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సిఎం జగన్ పై వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని పత్రికలకు, పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. వివేకా హత్య కేసుపై నిజాలు ఏమిటో కోర్టులు నిగ్గు తెలుస్తాయని, ఎవరెన్ని నిందలు వేసినా న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలను కూడా సిబిఐ తప్పుదోవ పట్టించిందని, దీనిపై సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించామని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వెల్లడించారు.