Come to debate: అసలు మీలోనే మార్పు రాకుండా దేశంలో ఏం మార్పు తెస్తారని కేసిఆర్ ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్ ను కేసిఆర్ కుటుంబ తమ చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. మోడీ మరో 15ఏళ్ళపాటు ప్రధానిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీలో ఎవరైనా రెండుసార్ల కంటే ఎక్కువగా పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికి అవకాశం లేదని, అలాగే ప్రధాని మోడీ తరువాత అయన కుటుంబంలో ఎవరూ ప్రధాని పదవికి పోటీ పడే అవకాశమే లేదని కిషన్ రెడ్డి అన్నారు. కానీ టిఆర్ ఎస్ లో ఇలాంటి పరిస్థితి ఉందా, ఎనిమిదేళ్ళు మీరు వెలగబెట్టింది సరిపోదా అని కిషన్ రెడ్డి అడిగారు.
తమది సిద్దాంతపరమైన పార్టీ అని, తాము కుటుంబ పార్టీలకు వ్యతిరేకమని,వీటి కారణంగానే దేశంలో అవినీతి పెరిగిపోయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ పార్టీ కాదని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించిన పార్టీ అని అన్నారు. 12 కోట్ల సభ్యులు ఉన్న పార్టీ అని, ఎన్నో రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు.
మోడీని విమర్శించే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు. కేసిఆర్ తాను ఫార్మ్ హౌస్ లో పండించిన పంటలతో తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు, ఆయన కుమారుడు అమెరికాకు వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి ఇక్కడి ప్రజలకు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రతిసారీ ప్రధాని రాష్త్రానికి ఏమి చేశారని మాట్లాడుతున్నారని, ఏమీ చేయకుండానే నడుస్తుందా అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Also Read : పల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్