Sunday, January 19, 2025
HomeTrending Newsఅప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారింది: కిషన్ రెడ్డి

అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారింది: కిషన్ రెడ్డి

Its not good: అప్పులు తెచ్చి పాలించడం సుపరిపాలన కిందకు రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని, అప్పులమీద ఎక్కువ ఆధారపడడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కావాలని ప్రజలు ఆశించారని, కానీ ఈ సిఎం, అధికారులు ఎక్కడెక్కడ అప్పులు దొరుకుతాయా అని మాత్రమే ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం అప్పులతో రానున్న రోజుల్లో కనీసం ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటుందని, రోడ్లు బాగు చేయలేరని, స్కూళ్ళు కట్టే పరిస్తి ఉండదని, పేదలకు ఇల్లు కట్టించలేరని అయన ఆందోళన వ్యఖ్తం చేశారు.

సీమలో పేదరిక నిర్మూలన కోసం,సాగునీటి ప్రాజెక్టుల కోసం మూడేళ్ళుగా ఎలాంటి నిర్దిష్ట  కార్యాచరణ తీసుకోలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, తమ పాలనపై సిఎం, ఆ పార్టీ నేతలు ఆత్మా పరిశీలన చేసుకోవాలని సూచించారు. కడపలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ‘రాయలసీమ రణభేరి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమ పార్టీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు.

ఈ సందర్భంగా అయన మట్లాడుతూ కుటుంబ పార్టీలు అభివృద్ధి చేయలేవని, కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడాలని కోరారు. రాయలు ఏలిన రతనాల సీమ రాయలసీమ నేడు అన్ని రంగాల్లో వెనకబడిందని, ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసినా అభివృద్ధి చేయలేకపోయారని, విభజిత ఏపీలో నాడు చంద్రబాబు, నేడు జగన్ సీమ ప్రాంతానికే చెందినా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

సీమ వెనకబాటుకు ప్రధాన కారణం సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయలేకపోవడమేనని స్పష్టం చేశారు, ఈ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి వాటాను తీసుకురావడంలో నేతలు చొరవ చూపలేదని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం సీమ ప్రాంతానికి ఎన్నో కేంద్ర విద్యా సంస్థలు, ప్రాజెక్టులను కేటాయించిందని చెప్పారు. సీమ అభివృద్ధి కోసం మొదటగా ఆలోచించిన పార్టీ బిజెపియేనని, నాడు స్వర్గీయ చిలకం రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో సీమ ప్రాంతమంతా పాదయాత్ర చేశామని, ఇక్కడి ప్రజలను చైతన్యం చేశామని గుర్తు చేసుకున్నారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలో మనసా, వాచా రాయలసీమ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామని, ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా న్యాయం జరగాలని, వివక్ష, పేదరికం పోవాలని,  దీనికోసం బిజెపి నాయకత్వంతో కలిసి రావాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్