జూలైలో విశాఖకు వెళుతున్నామని, అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ ముగిసిన తరువాత సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. నూతన పారిశ్రామిక విధానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. అలాగే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లులకు కూడా కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘అన్ని స్థానాలూ గెలవాల్సిందే’ అంటూ సిఎం మంత్రులకు తేల్చి చెప్పారు. ఈ బాధ్యతను మంత్రులకే అప్పగిస్తున్నానని, ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏడు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా, తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ కూడా పోటీలో ఉండడంతో పోలింగ్ అనివార్యమైంది. దీనితో ఈ ఎన్నికలపై మంత్రులకు సిఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి చొప్పున బాధ్యత తీసుకొని వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మంత్రుల పనితీరు గమనిస్తున్నాన ని… ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తోన్న వారిపై వేటు వేసేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ఇకపై ఉపేక్షించబోనని చెప్పారు.