Sunday, May 11, 2025
HomeTrending Newsఈసీ అనుమతిస్తే పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం

ఈసీ అనుమతిస్తే పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీని ద్వారా ఎక్కువమందికి ఉపాధి కూడా దొరుకుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే తయారు చేశామని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని. ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే  రేపు ఈ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు.  రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో  ఎలాంటి పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుందని బుగ్గన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు పరిశ్రమలకు ఇవ్వాలనే విషయమై ఓ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని పేర్కొన్నారు.  విశాఖలో రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో  కలిసి బుగ్గన మీడియాతో మాట్లాడారు.

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయని మరో రెండు గంటల్లో పూర్తి చేసి సభా వేదికను సెక్యూరిటీ వారికి అప్పగిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.  పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేచోట మరికొన్ని ప్రోత్సాహకాలు అదనంగా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని  చెప్పారు.  ముఖ్యమంత్రి సిఎం జగన్ ఈ రాత్రికి విశాఖ చేరుకుంటారని, రేపు మధ్యాహ్నం మొదటి సెషన్ పూర్తయిన తరువాత కొందరు పారిశ్రామిక వేత్తలతో సిఎం ముఖాముఖి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన వంటకాలు అతిథులకు వడ్డిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్