గ్రానైట్ పరిశ్రమల సీనరేజ్ లో తిరిగి శ్లాబ్ విధానం తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గత వైఎస్ హయాంలో శ్లాబ్ విధానం తీసుకువస్తే 2016లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని, తాను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు శ్లాబ్ విధానం తీసుకువస్తూ… దీనిపై నిన్ననే జీవో 58 తెచ్చామని చెప్పారు. శ్లాబ్ విధానం వల్ల ఏటా 135 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించిన సిఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మంచి చేస్తే అలాంటి నాయకుల చనిపోయాక కూడా బతికే ఉంటారని, దీనికి ఉదాహరణే నేడు తాను ఆవిష్కరించిన ఇద్దరు మహనీయులని పేర్కొన్నారు. పేదల, రైతుల సంక్షేమం అంటే తెలుగు నేలపై ఎప్పటికీ గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. సంక్షేమంలో నాడు వైఎస్ ఒక అడుగు వేస్తే, అయన బిడ్డగా ఈ జగన్ నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పడమే కాకుండా ప్రజలందరి ఆశీస్సులతో చేసి చూపిస్తున్నామని చెప్పారు. తన తండ్రి వైఎస్ తో కలిసి అడుగులు వేసిన సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏప్రిల్ 14 నాటికి విజయవాడలో డా. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.
గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలను కూడా సవరిస్తున్నామని, హెచ్.టి.కి 6.30; ఎల్. టి.కి 6.70 రూపాయలు వసూలు చేసే వారని దీనిపై రెండు రూపాయలు తగ్గిస్తున్నామని, దీనివల్ల 210కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ లో పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేశాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ హయంలో ఉరుకులు పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్టు చంద్రబాబు హయంలో నత్తనడకన సాగిందన్నారు.
అమ్మ బూచేపల్లి వెంకాయమ్మ కోరిక మేరకు ఒంగోలులో నూతన జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణానికి 20కోట్ల రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శివరామపురం మొగిలిగుండ చెరువులు మినీ రిజర్వాయర్ గా మార్చే పనిని ఇప్పటికే మొదలు పెట్టామని, దీనికి బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని భరోసా ఇచ్చారు.