నవంబర్ నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల భద్రతకు, సంక్షేమానికి సిఎం జగన్ ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం అన్న విషయాన్ని ఎప్పుడూ భావిస్తారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంవో) అధికారి ధనుంజయ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చలు జరిపారు. తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు విడుదల చేయాలని, టెంపరరీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదని, జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుందని అన్నారు. కోవిడ్ కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తాయని, అందువల్లే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో కొంత ఆలస్యమైందని చెప్పారు. జగన్ కు ఉద్యోగులంటే అభిమానం ఉంది కాబట్టే అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చేనెల నుంచి జీతాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగదని, పీఆర్సీ సమస్య కూడా ఈ నెలాఖరుకి కొలిక్కి వస్తుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నామని, వారికి అందుబాటులోనే ఉన్నామని, ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అయన సూచించారు. దసరా తర్వాత 18, 19 తేదీల్లో ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో చర్చలు జరుపుతారని సజ్జల వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాసులు, బొప్పరాజు తదితరులు పాల్గొన్నారు.