రాజకీయాల్లో రాజనీతి, లక్ష్మణ రేఖ చాలా ముఖ్యమని, వీటిని ఎవరూ దాటకూడదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో తమ ప్రభుత్వంలో డిఎస్పీల పదోన్నతుల్లో కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ వైసీపీ దుష్ప్రచారం చేసిందని… కానీ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో తాము అడిగితే ఆ డిఎస్పీల్లో నలుగురే కమ్మవారు ఉన్నారని ఈ ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా తాడిపత్రిలో రెడ్డి సంఘం ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. హిందూపురంలో నాడు ఎన్టీఆర్ పై జేసి ప్రభాకర్ రెడ్డి పోరాటం చేశారని, ఎన్నికల సమయంలో పోరాడారు కానీ కుటుంబ తగాదాలకు ఎప్పుడూ పోలేదని గుర్తు చేశారు. తాడిపత్రిలో వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థి ఇంటికి వెళ్లి కుర్చీలో కూర్చున్న సందర్భం ఉందా అంటూ లోకేష్ ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరూ బాగుండాలని, అన్ని రంగాల్లో తెలుగువారు ముందుండాలన్నది నాడు ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు ఆలోచన అని చెప్పారు.
వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు కొన్ని సార్లు పరుషంగా మాట్లాడినా తర్వాత ఆయన తప్పు ఒప్పుకున్నారని, చంద్రబాబు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలను వైఎస్ పూర్తి చేశారని లోకేష్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ ఇంటిపేరు అడిగి పనులు ఇవ్వలేదని, తాను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్నది ప్రస్తుత సిఎస్ జవహర్ రెడ్డి అని, తామిద్దరం కలిసి బాగా పనిచేశామని, ఫైల్స్ పెండింగ్ లేకుండా చేశామని గుర్తు చేసుకున్నారు. తన ఆఫీసులో కూడా రెడ్డి సోదరులు పనిచేస్తారన్నారు. గత ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచినా రెడ్డి సోదరులు కూడా ఇప్పుడు బాధపడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. పేదరికానికి కులం, మతం ఉండదని, అన్ని కులాల్లో పేదలు ఉంటారని.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదలను ఆదుకోవాలి కానీ ఏదో పదవులు ఇవ్వడం కోసం కాదని అన్నారు.
ఈ ప్రభుత్వ హయంలో అభివృద్ధి శూన్యమని, జీఎస్టీ వసూళ్లు మనకంటే ఒడిషాలో ఎక్కువ ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే మండుటెండలో పాదయాత్ర చేస్తున్నానని, అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కలిసి రావాలని కోరారు.