బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ అల్పపీడనం తర్వాత మరింత బలం పుంజుకుని వాయుగుండంగా మారి 8న తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య తీరం దాటుతుందన్న అంచనా ఉందన్నారు. ఈ విపత్తు ప్రభావం ఒడిశాపై ఉండకపోవచ్చని, పాక్షిక మబ్బులు ఉండవచ్చునని తెలిపారు. ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు. దీంతో పది రోజులపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు 8వ తేది నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 5న అల్పపీడనం ఏర్పడి..7న వాయుగుండంగా మారనున్నది. వరి కోతల వేళ… వర్షాల వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో కొద్ది రోజులు చలి తగ్గినా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందని ఐఎండీ ప్రకటించింది.