Monday, May 20, 2024
HomeTrending Newsకోవిడ్ ప్రమాద ఘంటికలు... చైనా యునివర్సిటీలకు సెలవులు

కోవిడ్ ప్రమాద ఘంటికలు… చైనా యునివర్సిటీలకు సెలవులు

కరోనా కేసులు పెరగడంతో చైనా రాజధాని బీజింగ్‌, వాణిజ్య రాజధాని షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. తాజాగా చైనా పౌరుల నుంచి నిరసనలు పెరగటంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థులను బలవంతంగా ఇళ్ళకు పంపుతున్నారు. యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్ లకు బస్ స్టాండ్ లకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి మరి విద్యార్థులను సాగనంపుతున్నారు. ఇక నుంచి తరగతులు ఆన్ లైన్ లో నిర్వహిస్తామని విశ్వవిద్యాలయాలు ప్రకటించాయి.

అయితే విద్యార్థులకు సెలవుల వెనుక ప్రభుత్వ ఆలోచన వేరే విధంగా ఉందని సమాచారం. కోవిడ్ ఆందోళనలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో తియోన్మిన్ స్క్వేర్ ఉద్యమాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రభుత్వం కోవిడ్ ఆందోళనలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తోంది. ఈ క్రమంలో ముందుగా విద్యార్థులు సంఘటితం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా బాధితుల సంఖ్య 3,72,964కు చేరింది.

Also Read : కోవిడ్ ఆంక్షలపై చైనా యువత ఆందోళనలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్