Saturday, November 23, 2024

పశుపాలన

Holiday: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా దుష్టశక్తులు, దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని ఈ ఆచారం చెబుతుంది. ఆవు పంచకం, నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండడానికి యోగ్యమవుతోంది.

పురాణాల ప్రకారం దేవుళ్ల వాహనాలకు కూడా దైవత్వం ఉంటుంది.

శివుడు- బసవడు
విష్ణువు- గరుత్మంతుడు
గణపతి- ఎలుక
సుబ్రహ్మణ్యుడు- నెమలి
అమ్మవారు- పులి/సింహం

ఇలా ఒక్కో దేవుడు/దేవతకు ఒక్కో వాహనం మనకు తెలిసిందే. ఇప్పుడంటే మనకు బెంజులు, బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు వచ్చాయి కానీ- అనాది కాలంలో పరమేశ్వరుడయినా కాస్త అక్కడిదాకా డ్రాప్ ఇవ్వు అని ఎద్దునో, గద్దనో అడగాల్సిందే. ఆ రోజుల్లో పశువులు కూడా మాట్లాడేవి. దాంతో పరమేశ్వరుడు బిజీగా ఉంటే ఆయన వాహనం నందితో మాట్లాడినా పని అయిపోయేది. పదితలల రావణాసురుడిని నంది అడ్డుకుంటేనే కదా నానా గొడవ జరిగింది.

వ్యాసాలన్నిటికి ఆవు వ్యాసమే మూలం. లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి. ఆవుపాలు, ఆవు నెయ్యి శ్రేష్ఠం. లేపాక్షి నంది ప్రపంచ ప్రసిద్ధం.

———————–
“లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ;
కైలాస శిఖరిలా కదలిరావయ్య ;
హుంకరించిన దెసలు ఊగిపోయేను;
ఖురముతో దువ్వితే కులగిరులె వణికేను ;
ఆకాశగంగకై
అర్రెత్తిచూస్తేను ;
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ;
నందిపర్వతజాత
నవపినాకినీ జలము ;
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ;
ఒంగోలు భూమిలో పెనుకొండ సీమలో ;
నీ వంశమీనాడు నిలిచింది గర్వాన

-అడవి బాపిరాజు

హరప్పా మొహంజదారో అతిపురాతన మానవనాగరికత చిహ్నాల్లో దొరికినవాటిలో పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు ప్రధానమయినది. గొడ్డును కొట్టినట్లు మనం కొడుతున్నా ఎద్దు భరిస్తూనే ఉంది. గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది. పొలాలన్నీ హలాలతో దున్నుతూనే ఉంది. ఫలసాయాన్ని వీపున మోసి ఇంటికి తెస్తూనే ఉంది. మెడమీద కాడిని కట్టుకుని యుగాలుగా మన నాగరికతను లాగుతూనే ఉంది.

అందుకే కర్నూలు జిల్లా హాలహర్వి దగ్గర విరుపాపురం గ్రామప్రజలు ప్రతిసోమవారం ఎద్దులకు వీక్లి ఆఫ్ ఇస్తున్నారు. స్నానం చేయించి, పూజలు చేసి పరవశిస్తున్నారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం, నంద్యాల, నందవరం, నందికొట్కూరు, మహా నంది…ఇలా అన్నీ నందితోనే ముడిపడి ఉండడం కాకతాళీయం కాదు. బసవ సంబంధ ఆధ్యాత్మికత, శైవ సంప్రదాయంతో కర్నూలుకు కనీసం ఎనిమిది వందల ఏళ్ల ప్రత్యక్ష సంబంధం ఉంది. అందులో భాగమే ఈ విరుపాపురం బసవడికి వారాంతపు సెలవు. ఆ ఊరి పేరే విరూపాక్షుడి పురం. మనుషులకే వారాంతపు సెలవు ఇవ్వకుండా గొడ్డుచాకిరి చేయించుకునే రోజుల్లో- ఎడ్లకు వారంలో ఒకరోజు సెలవు ఇస్తున్న విరుపాపురం గ్రామప్రజలు నిజంగా గొప్ప మనసున్నవారు. వారిని ఆ బసవడు ఎల్లవేళలా చల్లగా కాపాడుగాక!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

గేదె తంతోంది… అరెస్ట్ చేయండి సార్!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్