Monday, January 20, 2025
HomeTrending Newsజాతీయ రాజకీయాల్లోకి మమత దీ

జాతీయ రాజకీయాల్లోకి మమత దీ

బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి  మమతబెనర్జీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి ఓటమి కోసం అందరు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమత బెనర్జీ ఈ రోజు ఢిల్లీ లో  ఏ.ఐ.సి.సి. అధినాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పెగాసేస్ వ్యవహారం, కరోన కట్టడి చేయటంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిత్యావసరాల ధరలతో పాటు వివిధ అంశాలు చర్చకు వచ్చాయని మమత వెల్లడించారు.

సోనియా, రాహుల్ తో జరిగిన సమావేశంలో విపక్షాల ఇక్యతపై కూడా చర్చ జరిగిందని, త్వరలోనే ఆ దిశగా అడుగులు పాడుతాయని దీది ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి నియంతృత్వ విధానాల్ని ఎండగట్టేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాలని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాలన్నారు. పెగాసస్ వ్యవహారంలో కేంద్ర వైఖరి గర్హనీయమన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు వేదికగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో మమత బెనర్జీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వివిధ అంశాల్ని చర్చించారు. అత్యున్నత పదవుల్లో ఉన్నా సాధారణ జీవనం గడిపే మమత – కేజ్రివాల్ సమావేశం కవర్ చేసేందుకు జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తి కనబరిచింది.

వచ్చే నవంబర్ 4వ తేదీలోగా శాసన సభ్యురాలిగా మమత ఎన్నిక కావల్సి ఉంది. ఇందుకు దక్షిణ కలకత్తాలోని భవానీపూర్ నియోజకవర్గం ఖాళీగా ఉంది. అయితే కోవిడ్ పరిస్థితుల్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక నిర్వహించే సూచనలు లేవు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే కుట్ర జరుగుతోందని, కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు మమత దీ సిద్దమయ్యారు.

ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ ని ఆ పార్టీ ఎంపీలు తృణముల్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఉపఎన్నిక జరగపోతే మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కి సిఎం పదవి అప్పగించి, జాతీయ రాజకీయాల్లో 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని దీది సిద్దమయ్యారని టి.ఎం.సి పార్టీ నేతలు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర నామమాత్రంగా తయారైంది. దేశంలో ఇప్పుడు మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మోడీ తో డీ అంటే డీ అంటున్నారు. వీరికి శరద్ పవార్, ఉద్దావ్ థాకరే, సమాజ్ వాది పార్టి అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తోడైతే రాపోయే ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయి. మోడీ – అమిత్ షా ల  ప్రజా వ్యతిరేక  విధానాల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విమర్శిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్నారు.

తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీది గురువారం నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడు శరద్ పవార్ తో సమావేశం కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్