విజయశాంతి తరువాత ఆ స్థాయి స్టార్ డమ్ ను చూపించిన హీరోయిన్ గా నయనతార కనిపిస్తోంది. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఒక స్థాయి తరువాత నయనతార గ్లామరస్ పాత్రలను పక్కన పెట్టేసి, నటన ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది. ముఖ్యంగా నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా ఒప్పుకుంటూ వెళ్లింది.
సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ జోనర్లలో నయనతార తిరుగులేని స్టార్ గా ఎదిగింది. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు .. అక్కడి స్టార్ హీరోలతో సమానమైన వసూళ్లను చూశాయి. ఇక హీరోల జోడీగా కనిపించవలసి వస్తే, ఆయా భాషల్లో సీనియర్ స్టార్ హీరోలతోనే చేసింది. తెలుగులో చిరంజీవి .. వెంకటేశ్ .. బాలకృష్ణ సినిమాలను మాత్రమే ఆమె కాదనకుండా చేసింది. అయితే ఈ హీరోల సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఆమె వచ్చేది కాదు.
ఈ నేపథ్యంలో నయనతార డేట్స్ దొరకడమే కష్టమైపోయింది. ఆమె ఎంత పారితోషికం అడిగితే అంత ఇవ్వడానికి మేకర్స్ వెనుకాడలేదు. దాంతో సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా ఒక రికార్డు ఆమె ఖాతాలోకి వెళ్లిపోయింది. 20 ఏళ్లుగా సాగుతూ వచ్చిన నయనతార జోరు తగ్గినట్టేనా? అంటే .. తగ్గినట్టే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఆమె సినిమా ఏదీ భారీ విజయాన్ని సాధించలేదు. ఎప్పుడూ లేనిది ఆమె బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది. సొంత బ్యానర్ కోసం మొహమాటం లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది. నయనతార తీరు చూస్తుంటే తన క్రేజ్ తగ్గిందనే విషయం ఆమెకి కూడా అర్థమైనట్టుగానే అనిపించడం లేదూ!