Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం'శీల పరీక్ష 'లో పాసైన ఆప్.... ఎమ్మెల్యేలు ఇక సచ్ఛీలురేనా!

‘శీల పరీక్ష ‘లో పాసైన ఆప్…. ఎమ్మెల్యేలు ఇక సచ్ఛీలురేనా!

In Front Crocodile Festival?: రామాయణం లో శ్రీరామచంద్రుడు తన ధర్మ పత్ని సీతమ్మకు శీల పరీక్ష పెట్టింది…ఒక భర్త గా కాదు..ఒక ప్రభువుగా అగ్ని పరీక్ష కు ఆదేశించాడు. సీతమ్మ కూడా తన పవిత్రతను అగ్ని దేవుని సాక్షిగా నిరూపించుకుంది. ఒక ప్రభువుగా శ్రీరామచంద్రుడు అందిరికీ ఆదర్శమూర్తి గా మారాడు. ఆవును రామాయణం నాటి శీల పరీక్షల సంగతి ఎందుకంటారా ! అదే అక్కడికే వస్తున్నా…..

ఢిల్లీ రాజ్యాధీసుడు అదే ఆమ్ ఆద్మీ అధిపతి తమ ఎమ్మెల్యేకు శీల పరీక్ష, అదే విశ్వాసపరీక్ష పెట్టాడు.అగ్నిపరీక్షలో పునీతురాలైన సీతమ్మలా ఆమ్ ఆద్మీ శాసన సభ్యులు తమకు తామే ప్రవేశ పెట్టుకున్న విశ్వాసతీర్మానంలో విజయవంతంగా నెగ్గి జబ్బలు చరుచుకున్నారు. మా వాళ్ళంతా నిఖార్సయిన వాళ్లని పదే పదే పైకి చెప్పిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంచోళ్ళేకాని, అంటూ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరుపుకొని మరీ ఊపిరి పీల్చుకున్నాడు.నూటికి నూరుశాతం తనవాళ్లు, తనదగ్గరే ఉన్నారని నిరూపించుకొని బీజేపీ కి సవాల్ విసిరారు. తనలోవున్న అభద్రతా భావాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకున్న క్రేజీ కేజ్రివాల్ విశ్వాస పరీక్ష లో నెగ్గి సాధించింది ఏమిటో ఆయనగారికే తెలియాలి.

మహారాష్ట్ర షిండే ఎపిసోడ్ తర్వాత స్వతహాగానే కేజ్రీవాల్ తో పాటు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాల నేతలకు భయం పట్టుకుంది. తమలో కూడా షిండే లు దాగివున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలను ఎక్కుపెట్టారు. తమకు తాము జాగ్రత్త పడుతూనే అందరి ముందు బిజెపిని దోషిగా చూపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా పై బిజెపి నేతలు అవినీతి ఆరోపణలు గుప్పించటం ,సిబీఐ, ఈడీ ఎంటరవ్వడం చకచకా సాగిన వేళ తమ నేతను ప్రలోభ పెట్టేందుకే అవినీతి మరక అంటిస్తున్నారని, లిక్కర్ స్కాం వెలుగులోకి తెచ్చారని కేజ్రీవాల్ ప్రత్యారోపణలతో అడుగు ముందుకేశారు.అయితే సీసోడియా నివాసం, ఆఫీసులు, మిగతా వారి నివాసాల పైన సిబిఐ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే సిసోడియా కూడా తనకు బిజెపి నుంచి భారీ ఆఫర్ వచ్చిందని తమ పార్టీలో చేరితే సిబిఐ , ఈడీ కేసుల నుంచి బయటపడేస్తామని , ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కేలా చూస్తామని హామీలు ఇచ్చారంటూ బహిరంగంగానే వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు మరికొందరు కూడా ఇదే తరహా ఆఫర్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అటు కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికీ 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని బిజెపి ఆపరేషన్ లోటస్ కు పదును పెట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదంతా ఒక ఎత్తైతే తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేసినది ఎవరన్నది మాత్రం పేర్లు బయట పెట్టలేదు. సిసోడియా కూడా తనకు ఆఫర్ కాల్ వచ్చిందన్నారే కాని , వారి పేర్లు మాత్రం ససేమిరా చెప్పనంటూ సెలవిచ్చారు. దాంతో ఆపరేషన్ లోటస్ అసలు జరిగిందా? తమకు తాము జాగ్రత్త పడేందుకే ఈ నాటకాలు ఆడిందా అనేది కూడా అనుమానంగా మారింది.

ఏదైతేనేం ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నంతపనీ చేశారు. అసెంబ్లీ వేదికగా తనకు తానే బలపరీక్ష నిర్వహించుకుని తమకున్న ఎమ్మెల్యేల సంఖ్య కు తగ్గట్టుగా 59 ఓట్ల తో గెలిచారు. ఆప్ కు చెందిన మొత్తం 62 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు విదేశీ పర్యటనలో వుండగా, స్పీకర్ ను మినహాయిస్తే 59 ఓట్లు పడ్డాయి. విశ్వాస పరీక్ష వేళ చర్చలో అసెంబ్లీ వేదికగా బిజెపిని తూర్పార పట్టడానికి అవకాశాన్ని మాత్రం కేజ్రీవాల్ సద్వినియోగం చేసుకున్నారు.ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్ లోటస్ ఫెయిలై ఆపరేషన్ కీచడ్ (మట్టి) అయిందని ఎద్దేవా చేశారు.

అయితే బలపరీక్షలో నెగ్గానని జబ్బలు చరచుకున్న కేజ్రీవాల్ ఏమి సాధించగలిగారు. తమ ఎమ్మెల్యేలకు తాత్కాలికంగా క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వగలిగారే కాని, నిజంగా ఉపద్రవం ముంచుకొస్తే ఎవరు నిక్కచ్చిగా నిలబడతారో చెప్పలేం. ఈ బలపరీక్ష లు ప్రహసనంగా మారే అవకాశం ఉంది. అసలు ఆప్ సభ్యులకు ఆఫర్ ఇచ్చిన వారి పేర్లు, అధారాలతో బయటపెడితే బాగుండేదేమో. అసలు నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే కేజ్రీవాల్ అసలు నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు. ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలేవీ జరగలేదా?. తమ ప్రభుత్వం పై వస్తున్న అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీని వాడుకున్నారా… ఏమో ఈ రాజకీయ రామాయణం లో ఏదైనా జరిగే ఛాన్స్ వుంది. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరూ శీలవంతులు (గుణవంతులు) కాలేరేమో…. ఏదైనా ఆప్ ప్రభుత్వం తనకు తాను పెట్టుకున్న అగ్నిపరీక్ష లో నెగ్గడం ముదావహం. బలపరీక్ష నెగ్గాంకదాని ఆదమరిచి వుంటే కేజ్రీకే కాదు ఎవరి సీటు కిందకైనా నీళ్లు రాక మానవు.. బెస్ట్ ఆఫ్ లక్

–  వెలది. కృష్ణ కుమార్

Also Read : 

పాట్నా టూర్ పట్టెంత!

Also Read :

అజాద్ జ్ఞానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్