CM must visit:
వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసిటి)ని నియమించిందని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. నిన్న సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన వెంటనే కేంద్రం స్పందించిందని, ఈ బృందం రేపటినుంచి రాష్ట్రంలోని వరద పీడిత జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు. ఢిల్లీలో అయన మీడియాతో మాట్లాడారు.
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవీఎల్ ఆరోపించారు. విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్రం రాష్ట్రాలకు కొన్ని నిధులు ముందే మంజూరు చేస్తుందని, 15వ ఆర్ధిక సంఘం పరిధిలో 2021-26 సంవత్సరాలకు గాను ఈ నిధి కింద 8,239 కోట్ల రూపాయలు అంచనా వేసిందని, వీటిలో రూ. 6,183 కోట్లు కేంద్రం వాటా అని… దీనిలో 582 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1న ఏపీకి విడుదల చేసిందని వివరించారు. ఈ నిధుల్లో ఇప్పటి వరకూ ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలని, కేంద్రానికి సాయం కోసం ఓ లేఖ రాస్తే తమ బాధ్యత అయిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనబడుతోందని అయన విమర్శించారు.
ఈ వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతే, బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత సిఎంకు లేదా అని జీవీఎల్ ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తమ మిత్రపక్షం జన సేన తరఫున నాదెండ్ల మనోహర్, రెండ్రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని, సిఎం మాత్రం ప్యాలెస్ నుంచి బైటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వెళ్ళడం అనేది వైసీపీ విధానం అయితే అదే విషయాన్ని చెప్పాలని సూచించారు.
Also Read : తక్షణ వరద సాయం : సిఎం విజ్ఞప్తి