Saturday, January 18, 2025
Homeసినిమాచంద్రముఖి మ్యాజిక్ ని చంద్రముఖి 2 రిపీట్ చేసేనా..?

చంద్రముఖి మ్యాజిక్ ని చంద్రముఖి 2 రిపీట్ చేసేనా..?

‘చంద్రముఖి’ చిత్రం ఓ సంచలనం. రజినీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతిక కాంబినేషన్లో రూపొందిన చంద్రముఖి చిత్రాన్ని పి.వాసు తెరకెక్కించారు. తెర పై రజినీ, నయనతార, ప్రభు, జ్యోతిక మ్యాజిక్ చేస్తే.. తెర వెనుక పి.వాసు మ్యాజిక్ చేశారు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ వస్తుంది. అయితే.. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. పి.వాసు తెరకెక్కించిన చంద్రముఖి 2 ఈ నెల 28న రిలీజ్ కానుంది.

చంద్రముఖి 2 టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే.. చంద్రముఖి గుర్తొస్తుంది. నటీనటులు మారారు కానీ.. కథ అలాగే ఉంటుందా అనిపించింది. కొత్తగా ఏదో ఉంటుందనే ఫీలింగ్ మాత్రం కలిగించలేకపోయింది. అయితే.. బాలీవుడ్ బ్యూటీ కంగనా మాత్రం పాత్రకు తగ్గట్టుగా బాగానే నటించింది అని సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుద‌ల‌ కానుంది. అయితే.. చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది.

మరి.. ఈ సినిమాలో రజినీ నటించలేదు. అప్పుడు జరిగిన మ్యాజిక్ ఇప్పుడు జరుగుతుందా..? రాఘవ లారెన్స్.. రజినీ చేసిన పాత్రలో మెప్పించగలడా..? అనేదే అందరిలో ఉన్నఅనుమానం. ఇదే విషయం గురించి లారెన్స్ ని అడిగితే..  ర‌జినీకాంత్‌ గారు చేసిన రోల్‌లో నేను న‌టించ‌టం అంటే ఆ రాఘ‌వేంద్ర‌స్వామి అదృష్టం అని అనుకోవాలి. సూప‌ర్‌స్టార్‌ గారు చేసిన ఆ పాత్ర‌ను నేనెంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించ‌లేదు. నా పాత్ర‌కు నేను న్యాయం చేస్తే చాల‌ని అనుకుని చాలా భ‌య‌ప‌డుతూ న‌టించాను. ఖచ్చితంగా సినిమా మీ అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అనుకుంటున్నాను అని లారెన్స్ అన్నారు.

చంద్రముఖి సినిమా వచ్చినప్పటి ట్రెండ్ వేరు.. ఇప్పుడు ట్రెండ్ వేరు. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అలాగే ఈమధ్య కాలంలో చాలా హర్రర్ సినిమాలు వచ్చాయి. పైగా ఇప్పుడు సినిమా కొత్తగా ఉందంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. లేదంటే.. ఓటీటీలో చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో చంద్రముఖి 2 మ్యాజిక్ రిపీట్ చేయాలి అంటే.. కథలో చాలా కొత్తదనం ఉండాలి. మరి.. ఏం జరగనుందో.. బాక్సాఫీస్ దగ్గర చంద్రముఖి 2 ఏం చేయనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్