ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. రవీంద్ర జడేజా, అశ్విన్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే కుప్ప కూలింది. జడేజా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు, మిగిలిన మూడు అశ్విన్ ఖాతాలో పడ్డాయి. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులతో నేడు మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్ 82 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది. 85 వద్ద స్టీవెన్ స్మిత్ (9) వెనుదిరగగా, స్కోరు 95 వద్ద ఏకంగా నాలుగు వికెట్లు ఆసీస్ కోల్పోవడం గమనార్హం. జట్టులో ట్రావిస్ హెడ్-43; లబుషేన్-35 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ముగ్గురు డకౌట్ గా వెనుదిరిగారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 6 పరుగుల వద్ద కెఎల్ రాహుల్ (1) వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడి 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసిన రోహిత్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. కోహ్లీ-20; శ్రేయాస్-12 కూడా ఔటయ్యారు. పుజారా-31; శ్రీకర్ భరత్-23 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో లియాన్ రెండు; మర్ఫీ ఒక వికెట్ పడగొట్టారు.
రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ ‘ దక్కింది.
నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది.