Tuesday, January 21, 2025
HomeTrending Newsరాష్ట్రమంతటా విష సంస్కృతి : గోరంట్ల ఆరోపణ

రాష్ట్రమంతటా విష సంస్కృతి : గోరంట్ల ఆరోపణ

సంక్రాంతి సంబరాల పేరుతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని జూదశాల, పానశాలగా మార్చి వేశారని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఈ మూడురోజుల్లో వెయ్యికోట్ల టర్నోవర్ జరిగిందని, వీటిలో రూ.300 కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.  సంక్రాంతి పండుగకు రాష్ట్రంలో విష సంస్కృతికి నాంది పలికారన్నారు.

ఓ వైపు కోడి పందేలు, మూడు ముక్కలాట, పేకాట నిషేధం అని చెప్పారని, కానీ రాష్ట్రంలో దాదాపు ప్రతి వూళ్ళో గుడారాలు వేసి మరీ కోడి పందేలు నడిపారని బుచ్చయ్య అన్నారు.  జీవో నంబర్ 1, సెక్షన్ 30 అని చెప్పిన వారు ఇన్ని వేల మందిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు.  సిఎం కనుసన్నల్లోనే, ఆయన నివాసానికి సమీప గ్రామాల్లో ఈ సంబరాల పేరుతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.

గతంలో కోనసీమలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ కోడి పందేలు, పేకాట సంస్కృతిని రాష్ట్రమంతటా, పులివెందులకు సైతం విస్తరించారని పేర్కొన్నారు.  గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నగ్న నృత్య ప్రదర్శనలు కూడా చేశారని సంచలన ఆరోపణ చేశారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో సంక్రాంతి కానుక పేరుతో 16 రకాల వస్తువులను పేదలకు పంపిణీ చేశామని, మండల స్థాయిలో క్రీడా, ముగ్గులు, నాటక పోటీలు పెట్టి ప్రోత్సహించామని, కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నడుపుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు నిలువరించలేక పోయారని అడిగారు. ఎమ్మెల్యేలే స్వయంగా గూండాట ఆడారన్నారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జూద గృహంగా మార్చారన్నారు.  ప్రభుత్వ తీరుతో తెలుగు సంస్కృతి మంటగలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్