Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

విభజన హామీల సాధనలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాడడం లేదని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సాధనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్యం వహిస్తోందని మండిపడ్డారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. అనంతరం ఎంపీలు రామ్మోహన్, గల్లా జయదేవ్ , కనకమేడల రవీంద్ర కుమార్ లు మీడియా సమావేశం నిర్వహించారు.

గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు చంద్రబాబు, టిడిపి నేతలు నాటి ప్రధాని వాజ్ పేయి ని కలిసి ఒత్తిడి తెచ్చి దాన్ని విరమింపజేశామని, కానీ ఇప్పుడు మరోసారి కేంద్రం స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెడితే ఎందుకు దీనిపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని రామ్మోహన్ అడిగారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకుండా కొనసాగించే అనేక మార్గాలను స్వయంగా ప్లాంట్ కార్మిక సంఘాల వారే చెబుతున్నారని,  జగన్ ప్రభుత్వం కనీసం వాటిని పరిశీలించే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వారే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి భేషరతుగా మద్దతు ఇచ్చిన వైఎస్సార్సీపీ విభజన హామీల అమలు కోసం ఎందుకు అడగలేకపోయిందని నిలదీశారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో తాము ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చామని, కానీ తమను ఢిల్లీ పిలిచి సంప్రదించారని వైసీపీ నేతలే చెప్పుకున్నారని రామ్మోహన్ గుర్తు చేశారు.  బలహీనవర్గాల విషయంలో తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ ఒకే విధంగా ఉందన్నారు.

వైసీపీ నేతలు సామాజిక కోణంలో ద్రౌపదికి మద్దతు ఇవ్వలేదని మీరు ఎవరిని పెట్టినా తాము మద్దతిస్తామని ప్రధానికి స్వయంగా చెప్పారని కనకమేడల వివరించారు. ప్రాబబుల్ అభ్యర్ధులు అందరినీ విజయసాయి రెడ్డి కలిసి వచ్చారని గుర్తు చేశారు.  ప్రజాస్వామ్యంలో అధికార, విపక్షాలకు వేర్వేరు పాత్రలు ఉంటాయని తాము రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నామని గల్లా జయదేవ్ అన్నారు. అయినా తాము రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నామని, ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని, ఆ పాత్రను తాము సమర్ధంగా పోషిస్తున్నామని చెప్పారు.

Also Read : పర్యావరణ విధ్వంసం జరుగుతోంది: బాబు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com