తెలంగాణలో సమస్యలు లేని గ్రామం లేదని, సమస్యలు లేని వర్గం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వర్గాన్ని 8 ఏళ్లుగా కేసీఅర్ మోసమే చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం.. పిట్లం మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకి ప్రజలు ఈ రోజు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన షర్మిల కెసిఆర్ పాలపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ హయాంలో ఎవరికైనా కష్టం వస్తె తన బిడ్డకే వచ్చినట్లు పరిష్కారం చేసే వారని గుర్తు చేశారు. ఇప్పుడు VRA లు రాష్ట్రంలో 79 రోజులు గా ఆందోళన చేస్తున్నా పట్టించుకునే వారు లేరని విమర్శించారు.
VRAలు అసలు మనుషులే కాదన్నట్లు సిఎం కెసిఆర్ చూస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రతి వర్గాన్ని కేసీఅర్ ఆగం చేశాడన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ…? అని ప్రశ్నించారు. కేసీఅర్ కి ఆయన కొడుకుకి..కూతురికి..అల్లుడికి తెలంగాణ బంగారు గని అయ్యిందన్నారు. కేసీఅర్ పార్టీకి..ఆయన మంత్రులకు,ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ అన్నారు. కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు.
తెలంగాణ యువతీ యువకులు డిగ్రీలు, పిజిలు చదివి పత్తి తియ్య బోతున్నారు… ఆటో డ్రైవర్లుగా మిగిలి పోతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 16 వేల కోట్ల మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల అప్పుల కుప్ప చేసి పెట్టాడని, ఇంత అప్పు చేసినా దేనికి డబ్బు లేదు అంటున్నాడని ఆరోపించారు. కెసిఆర్ అంతా స్వాహా చేసేశాడన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేరు చెప్పి మొత్తం దోచేశారని, 70 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తినేశాడన్నారు. ఆ సొమ్ముతో ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడన్నారు.
ప్రజాధనం దోచుకున్న కెసిఆర్ విమానాలు కొంటున్నాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. మొన్న ఒక ఎమ్మెల్యే brs పార్టీ అయ్యిందని .. కోడి క్వాటర్ పంచాడని, క్వాటర్,కోడి పంచితే ఇక బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని అనుకోవాలి కదా అని షర్మిల వ్యంగ్యంగా విమర్శించారు. కేసీఅర్ ఎప్పుడు బయటకు వచ్చినా ఓట్ల కోసమే వస్తాడని, మీ ఓట్లతోనే కేసీఅర్ కి పని దొరికిందని, మంచి మంచి మాటలు చెప్పడం…ఓట్లు గుద్దించుకోవడం మాత్రమే కెసిఆర్ కు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ ఆగడాలు 8 ఏళ్లుగా సాగినయి అంటే కాంగ్రెస్,బీజేపీ వైఫల్యమే అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉంటే…కేసీఅర్ అరాచకాలు సాగేవి కాదన్నారు. ఈసారి కేసీఅర్ కి కర్రు కాల్చి వాత పెట్టాలని షర్మిల ప్రజలకు పిలుపు ఇచ్చారు. పాలకులు ప్రజలకు సమస్యలు లేవని బుకాయిస్తున్నారని, సమస్యలు ఉన్నాయని నేను పాదయాత్ర చేస్తూ ఎత్తి చూపిస్తున్న అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తానన్న వైఎస్ షర్మిల వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
Also Read : కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే వైఎస్ షర్మిల ఆరోపణ