వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా వెల్లడించింది.
అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
జూలై 8న ఈ అవార్డులకు ఎంపికైన సంస్థలు, వ్యక్తుల పేర్లను ప్రకటించారు. మొత్తం 62 మందికి అవార్డులు లభించాయి. సామాజిక సేవా సంస్థలు, రైతులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు, కోవిడ్ వారియర్స్ పేరిట ఆరు విభాగాల్లో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 62 అవార్డుల్లో 31 వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, 31 వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులు ఉన్నాయి. లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ విజేతలకు 10 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం; వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డు విజేతలకు 5లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించనున్నారు.