దళితులను సామాజిక,ఆర్దిక,రాజకీయరంగాలలో ఉన్నతస్ధాయిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ సిపి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, వీటిని ప్రతి దళిత కాలనీకి, ప్రతి దళిత కుటుంబానికి చేరువ చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రతి దళితుడు కోరుకుంటున్నట్లు నాగార్జున స్పష్టం చేశారు. .
ఎస్సీల సంక్షేమ పధకాల అమలు, తీరుతెన్నులు, వాటి ప్రచారం అంశాలపై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి మేరుగ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు, శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్,కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో దళితులకు తీరని అన్యాయం చేసిందన్నారు. వారి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో బడ్జెట్ లో కేవలం 33,625 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే జగన్ మూడున్నరేళ్ళ కాలంలోనే 48,899 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. దళితులపై దాడులను,అత్యాచారాలను ప్రోత్సహించడమే కాక వారిని ఎన్నో అవమానాలకు గురిచేసిన చంద్రబాబును ఎట్టిపరిస్ధితులలోను నమ్మవద్దని తెలిపారు. జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న మేలును, అందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్ర స్థాయి ఎస్సీ సదస్సును నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు.